గ్రహాంతరవాసులు... (ఏలియన్స్) ఉన్నట్టు ఎక్కడా ఆధారాలు లేవు. పైగా ఈ విషయంలో శాస్త్రవేత్తలందరిదీ ఒకే మాట. గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి ప్రపంచంలో ఇంకా ఎక్కడా ఆధారాలు లభించలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ గ్రహాంతరవాసులు ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతూనే ఉంది. ఇపుడు ఆదిలాబాద్ అడవుల్లో ఏలియన్స్ సంచరిస్తూ ఆహారంగా గొర్రెలను చంపుకుతిన్నట్టు సోషల్ మీడియా వేదికగా ఓ వార్త వైరల్‌గా మారింది.
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా జిన్నారం అడవుల్లో ఏలియన్స్ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. జిన్నారంలోని ఓ గూడెంలో ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో గొర్రెలు చనిపోయాయి. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో అటవీ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల్లో నిక్షిప్తమైన ఫోటోల్లో అతి పెద్ద పాదం కనిపించిందంటూ ప్రచారం ఊపందుకుంది.
ఆదిమానవుల ఆనవాళ్లతో పాదం, కాలి వేళ్లు ఉన్న ఫొటోలు, గ్రహాంతర వాసులను పోలిన వ్యక్తుల ఫొటోలంటూ ప్రచారం ఉధృతమైంది. రెండు కొమ్ములు, పెద్ద చేతులు, కాళ్లు, గోర్లు ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. అంతేనా... ఆహారంగా ఆహారంగా గొర్రెలను చంపుకు తిన్నారంటూ సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫొటోలన్నీ నిజమైనవి కావని చాలామంది కొట్టిపారేస్తున్నారు.