వైకాపా ఎమ్మెల్యే శంకర నారాయణపై డిటొనేటర్‌ దాడి.. తప్పిన ముప్పు

ఆదివారం, 8 అక్టోబరు 2023 (17:41 IST)
అనంతపురం జిల్లా పెనుకొండ వైకాపా ఎమ్మెల్యే శంకర నారాయణకు ప్రాణాపాయం తప్పింది. ఆయన కాన్వాయ్‌పై డిటొనేటర్ దాడి జరిగింది. ఈ దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ దాడి ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీ పరిధిలో ఆయన ఆదివారం గడప గడపకు మన ప్రభుత్వం అనేక కార్యక్రమం నిర్వహించగా, ఇందులో ఆయన తన అనుచరగణంతో కలిసి పాల్గొన్నారు. ఆయన కారు దిగి కాలి నడకన వెళుతున్నారు. ఇంతలో ఓ వ్యక్తి ఎమ్మెల్యే కాన్వాయ్‌పై డిటొనేటర్‌ను విసిరాడు. అయితే, ఆ డిటొనేటర్ పక్కనే ఉన్న పొలాల్లో పడింది. పైగా అదృష్టవశాత్తు అది పేలలేదు. వెంటనే వైకాపా నేతలు ఆ డిటొనేటర్‌ను విసిరిన వ్యక్తిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. అది ఒక ఎలక్ట్రిక్ డిటొనేటర్ అని, దానికి పవర్ సరఫరా లేకపోవడంతో అది పేలలేదని గుర్తించారు. 
 
దీనిపై గోరంట్ల సీఐ సుబ్బారాయుడు స్పందిస్తూ, నిందితుడిని సోమందేపల్లి మండలం గుడిపల్లికి చెందిన గణేశ్‌గా గుర్తించినట్టు చెప్పారు. మద్యంమత్తులో డిటొనేటర్ విసిరినట్టు భావిస్తున్నామన్నారు. దీనిపై ఎమ్మెల్యే శంకర నారాయణ స్పందిస్తూ, ఇది ఖచ్చితంగా హత్యాయత్నమేనని, దీని వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో తనకు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఈ దాడికి పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. డిటొనేటర్ పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఆయన వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు