కాగా, ఈ కేసులో ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఆనందయ్య తన మందుపై ఆయుర్వేద కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకోలేదన్నారు. ఆనందయ్య మందుపై పరీక్షల నివేదికలు ఈ నెల 29న వస్తాయని వెల్లడించారు. దీంతో హైకోర్టు స్పందిస్తూ... ఆనందయ్య మందు కోసం ఎంతో మంది ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారని... వీలైనంత త్వరగా నివేదికలు అందజేయాలని సూచించింది.
ఆనందయ్య తరపు న్యాయవాది అశ్వని కుమార్ వాదిస్తూ... ఆయన మందును ఆపాలని లోకాయుక్త ఎలా ఆదేశిస్తుందని ప్రశ్నించారు. ఆనందయ్యతో ప్రైవేట్‌గా మందు తయారు చేయిస్తున్నారని ఆరోపించారు. ఆయన మందును ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఇరువైపుల వాదనలను ఆలకించిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాకుండా, ఆనందయ్య మందుపై ఎవరు అనుమతి ఇవ్వాలి, ఆ మందుపై అభిప్రాయం ఏంటో కోర్టుకు తెలియ జేయాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. మందులో ఏం కలుపుతున్నారో తెలుసుకుని దాని వల్ల ప్రజలకు ఇబ్బంది లేదంటే కేంద్ర ఆయుష్ శాఖ అనుమతి ఇస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఆనందయ్య మందు వల్ల ఇబ్బందులు లేవని.. లిఖిత పూర్వకంగా ఇది ఇంకా స్పష్టం కాలేదని కూడా హైకోర్టు తెలిపింది.