అమరావతి ఉద్యమం స్వార్థపూరితం - ప్రభుత్వ నిర్ణయం సముచితం : మంత్రి బొత్స

గురువారం, 18 నవంబరు 2021 (12:27 IST)
అమరావతి ఉద్యమాన్ని స్వాతంత్ర్య ఉద్యమంతో ఏపీ హైకోర్టు పోల్చడాన్ని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. దేశం చేసింది స్వాతంత్ర్య ఉద్యమం అని గుర్తుచేశారు. కానీ, అమరావతి ఉద్యమం స్వార్థం కోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. న్యాయస్థానం నిజంగా అలా వ్యాఖ్యానించి ఉంటే చాలా దురదృష్టకరమనేది తన వ్యక్తిగత అభిప్రాయని అన్నారు.
 
అమరావతి రైతుల ఉద్యమాన్ని స్వాతంత్య్ర ఉద్యమంతో హైకోర్టు పోల్చిందని చెబుతున్న మాటలపై ఆయన స్పందించారు. కోర్టు వ్యాఖ్యలను తాను నమ్మలేకపోతున్నానని, న్యాయస్థానం అలా వ్యాఖ్యానించి ఉంటే చాలా దురదృష్టకరమని అన్నారు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేశారు.
 
అమరావతి ఉద్యమాన్ని తెలుగుదేశం పార్టీ స్వార్థం కోసం చేయిస్తోందని ఆయన ఆరోపించారు. మూడు రాజధానులు ఏర్పాటుకు వైకాపా కట్టుబడి ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు... ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం అభివృద్ధికి ప్రజలిచ్చిన తీర్పుగా అభివర్ణించారు.
 
ప్రజలు వైకాపా ప్రభుత్వ పనితీరుకు నూటికి 97-98 శాతం మార్కులు వేశారని, రాష్ట్రంలో 97-98 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో ఒకటి రెండు చోట్ల పార్టీ ఓడిందని... ఓటమికి గల కారణాలను సమీక్షించుకుని సరిదిద్దుకుంటామని మంత్రి బొత్స వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు