ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి, ఇతర నేతలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, ఏపీలో బ్లీచింగ్ పౌడర్ బాగా పనిచేస్తుందంటూ సెటైర్లు వేశారు.
కరోనా వైరస్ నియంత్రణ, తక్కువ ప్రాణనష్టంతో ఏపీ దిశా నిర్దేశం చేస్తోందని, ప్రతి రాష్ట్రం ఏపీని అసుసరిస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. పైగా, ఏపీ చర్యలను కేంద్రం కూడా ప్రశంసించిందనీ, ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరా తీస్తోందని విజయసాయి రెడ్డి అన్నారు.
ఈ వ్యాఖ్యలపై బుద్ధా వెంకన్న చురకలంటించారు. "పారాసిటిమాల్‌తో కరోనాని ఎదుర్కొన్నందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సంభ్రమాశ్చర్యాలకు గురైంది. బ్లీచింగ్ పౌడరుతో వైరస్‌ని చంపినందుకు ఇతర దేశాల అధినేతలు ఆశ్చర్యపోతున్నారు. స్కాట్లాండ్ యార్డు పోలీసులు, ఇంటర్ పోల్ కూడా వస్తోందట" అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
'కరోనాతో ప్రపంచమంతా భయపడి చస్తుంటే... ఇంటింటికీ కరోనా - వైఎస్ జగన్ నజరానా స్కీమ్ ద్వారా ఎలా వ్యాప్తి చేశారో దర్యాప్తు చేస్తారట' అని ఎద్దేవా చేశారు. ఏపీలో కరోనా కేసులు వెయ్యికి చేరుగా వస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, కర్నూలు, గుంటూరు జిల్లాలు కరోనా హాట్ స్పాట్ కేంద్రాలుగా మారాయి.