మంత్రి పదవి రాకపోతే ప్యాకేజీలున్నాయి కదా అసమ్మతెందుకు: మై హూ నా అంటూ బుజ్జగిస్తున్న బాబు

ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (07:06 IST)
పార్టీనే నమ్ముకున్న వాళ్లను, చాలా కాలంగా పదవులకు దూరంగా ఉన్నవాళ్లను, ఈసారైనా పదవి రాకపోతుందా, బాబు కరుణించకపోతాడా అని కొండంత ఆశతో కోటి ఆకాంక్షలతో ఎదురుచూసిన వారి కళ్లు కాయలు కాచాయే కానీ మంత్రి పదవి రాలేదు. పైగా నిన్న కాక మొన్న పార్టీ ఫిరాయించి మరీ వచ్చిన  వారిని పిలిచి అందలమెక్కించిన అవమానాన్ని జీర్ణించుకోలేని అహం. ఏళ్ల  తరబడి పార్టీకి సేవ చేసిా పట్టించుకోలేదనే ఆగ్రహావేశం.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో స్థానం లభించక గుండె బద్దలయిన ఎమ్మెల్యేలు, సీనియర్ టీడీపీ నేతల దుస్థితి ఇది. ఒక్కరాత్రిలో వాళ్ల ఆశలు ఆవిరైపోయాయి. ఇక ఎందుకీ పార్టీకి కంచిగరుడ సేవ అని తలపట్టుకు కూర్చున్నవారని చంద్రబాబే స్వయంగా పలకరించారు. బుజ్జగించారు. నేను లేనా, మిమ్మల్ని చూసుకోనా, మంత్రి పదవి రాకపోతేనేం ఎవరికి రావలిసన ప్యాకేజీలు వారిక వస్తాయి కదా. మీరు కోరుకున్న తాయిలాలు ఇప్పిస్తాను కదా... అంటూ బాబే బుజ్జగిస్తున్న చాలామందికి తమ పరిస్థితి అర్థం కాక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 
 
శనివారం ఉదయం నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు తమకు మద్దతుగా ఉన్న వారిని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కూడా తీరిక చూసుకుని ఆశావహులను అందరినీ కలుస్తున్నా ఎవరికీ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. అయితే మంత్రి పదవులు ఖాయమైన వారికి వ్యతిరేకంగా ఉన్న వారితో ఫోన్‌లో మాట్లాడారు. మంత్రి పదవులు ఇవ్వలేని వారికి మంచి కార్పొరేషన్లు ఇస్తానని, అవసరమైతే ఆర్థికంగానూ ఆదుకుంటానని ముఖ్యమంత్రి హామీ ఇస్తున్నట్లు తెలిసింది. అయినా పలువురు తమకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
మృణాళిని, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాథ్‌రెడ్డి, రావెల కిషోర్‌బాబు, పీతల సుజాతలను పిలిచి ఇక మంత్రివర్గంలోకి చోటు లేదని ముఖ్యమంత్రి పిలిచి చెప్పడంతో వారు హతాశుతులయ్యారు. తమను కొనసాగించాలని కోరినా ఆయన పట్టించుకోలేదు. మంత్రి పదవి హామీతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చిన జ్యోతుల నెహ్రూ, చాంద్‌బాషాలకు మొండిచేయి చూపడంతో వారు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. టీడీపీ తమను వాడుకుని వదిలేసిందని వాపోతున్నారు.
 
ఎన్నికలకు కేవలం రెండేళ్ల సమయం మాత్రమే ఉండగా, చంద్రబాబు చేపట్టిన మంత్రివర్గ విస్తరణ టీడీపీలో చిచ్చు రేపుతోంది. పదవిపై గంపెడాశలుపెట్టుకున్నవారు తమను కాదని వేరే వారికి అవకాశం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కొన్ని జిల్లాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులిస్తుండడంతో వారి ప్రత్యర్థులు నేరుగా ముఖ్యమంత్రినే నిలదీశారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేసినా పట్టించుకోలేదని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అసంతృప్తులు, అలకవహించిన వారిని బుజ్జగించేందుకు, తాయిలాలిచ్చి లాలించేందుకు ఎప్పటిమాదిరిగానే చంద్రబాబు సీనియర్లను రంగంలోకి దించారు. పలువురితో స్వయంగా మాట్లాడారు.
 
వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఖరారు చేయడంతో ఆయన ప్రత్యర్థి రామసుబ్బారెడ్డి తన వర్గంతో విజయవాడ చేరుకున్నారు. ఆయన్ను బుజ్జగించేందుకు ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. ఆదినారాయణరెడ్డి మంత్రయినా పార్టీలో ప్రాధాన్యం ఉండేలా ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి ఇప్పిస్తానని, లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చేందుకు సీఎంను ఒప్పిస్తానని గంటా చెప్పినా వారు వినలేదని సమాచారం. నారాయణరెడ్డి మంత్రిగా ప్రమాణం చేస్తే తాను తన వర్గంతో సహా పార్టీ మారిపోతానని ఇందులో ఎలాంటి తేడా ఉండదని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. తొందరపడవద్దని వారించిన గంటా ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్లగా అక్కడ రామసుబ్బారెడ్డి చంద్రబాబును నిలదీసినట్లు సమాచారం.
 

వెబ్దునియా పై చదవండి