మోసం చేయడo, ప్రజలలో భ్రమలు కల్పించడం చంద్రబాబు వీడలేదు: సజ్జల రామకృష్ణారెడ్డి

మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (22:35 IST)
ప్రతి పేద విద్యార్ధి ప్రాధమిక విద్యనుంచి ఉన్నత చదువుల వరకు చదువుకునేల ప్రణాళికను రూపకల్పన చేసిన ఘనత  వైయస్ జగన్ దని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

ముఖ్యంగా ప్రతి విద్యార్ధి ఇంగ్లీషు నేర్చుకోవడంతో పాటు ప్రపంచంలోని ఏ విధ్యార్దితో అయినా పోటీపడగలిగేలా తీర్చిదిద్దాలనే దిశగా వైయస్ జగన్ అడుగులు వేస్తున్నారని తెలియచేశారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ముస్లిం సంచార జాతుల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి ముస్లిం సంచార జాతుల కార్పోరేషన్ ఛైర్ పర్సన్  సయ్యద్ ఆసిఫా అధ్యక్షత వహించారు.
 
సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్య, వైద్యం ఖరీదైపోయి పేద, మధ్యతరగతి వర్గాలు ఆర్ధికంగా చితికిపోతున్న విషయం గమనించి వైయస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీలను ప్రవేశపెట్టారన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మరో రెండడగులు ముందుకు వేసి విద్య,వైద్యం ను శాశ్వతంగా పేద, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులోకి తెచ్చేందుకు నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను పటిష్టపరిచారన్నారు.

అదే విధంగా ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఉండేలా చేయడంతోపాటు వెనకబడిన ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో కూడా వాటిని ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఇవన్నీ పూర్తయితే పేద, మధ్యతరగతి వర్గాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా చంద్రబాబునాయుడు మోసాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. చంద్రబాబు హయాంలో కేవలం 35 లక్షల మందికి పింఛన్ లు అందిస్తే నేడు వైయస్ జగన్ 60 లక్షల మందికి పింఛన్ లు అందిస్తున్నారన్నారు.

చంద్రబాబు హయాంలో పింఛన్ లకు నెలకు 500 కోట్ల రూపాయలు కేటాయించేవారని, నేడు పింఛన్ ల బడ్జెట్ 1400 కోట్ల రూపాయలని తెలియచేశారు. చంద్రబాబు దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల మేర అప్పుల తెచ్చి రాష్ర్టాన్ని దివాలా తీయించారన్నారు. నేడు వైయస్ జగన్ దాదాపు లక్షకోట్ల మేర వివిధ పథ‌కాల కింద ప్రత్యక్షంగా ప్రజల ఖాతాలలోకి వేయడం జరిగిందన్నారు. చంద్రబాబు హయాంలో దోపిడీ సాగితే నేడు అంతా పారదర్శకంగా ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు వైయస్ జగన్ పాలన అందిస్తున్నారని వివరించారు.

ముస్లిం సంచార జాతులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని కోరారు. ప్రభుత్వ పథ‌కాల గురించి చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా చేస్తున్న విష, దుష్ప్రచారం తిప్పికొట్టాలని కోరారు. నిత్యం ప్రజలతో మమేకం అవ్వడమే వైయస్ జగన్ కు ఇష్టం అయిన అంశం అని అన్నారు.

చంద్రబాబులా భ్రమలు కల్పించడం, అధికారం కోసం మోసాలు, కుట్రలు, కుతంత్రాలు చేయడం వైయస్ జగన్ కు తెలియవని అన్నారు. ప్రజలకు మేలు కలుగుతుందనుకుంటే ఎంత కష్టమైన పని అయినా  వైయస్ జగన్ చేసి తీరతారని అన్నారు. చంద్రబాబు విష, దుష్ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రజల సమస్యలను తీరుస్తూ వారితో ఉండగలగడమే కార్యకర్తలు చేయాల్సిన పని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు