చంద్రబాబు పర్యటన... అతిథి గృహానికి కరెంట్ కట్.. అమర్నాథ్ రెడ్డి ఫైర్

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (12:12 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా, ఆయన బస చేసిన ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ చర్యను తెదేపా శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపై మాజీ మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
స్థానిక ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి, జిల్లా నేత, ఓ పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు బస చేసిన ఆర్‌అండ్‌బి అతిథి గృహానికి విద్యుత్ సరఫరా నిపివేయడం దారుణమన్నారు. ఇది ప్రభుత్వంతో పాటు అధికారుల కక్ష సాధింపు చర్య అని ఆరోపించారు. 
 
'గెస్ట్ హౌస్‌కు కావాలనే కరెంట్ కట్ చేశారు. కనీసం జనరేటర్, బ్యాటరీ కూడా ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో మేము కూడా షాకులిస్తాం. కచ్చితంగా భవిష్యత్తులో ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు' అంటూ బహిరంగంగానే హెచ్చరికలు చేశారు. 
 
కాగా.. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటిస్తున్నారు. చంద్రబాబు బస చేసిన ఆర్‌అండ్‌బి అతిథి గృహం వద్దకు ప్రజలు, టీడీపీ  కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ప్రజల నుంచి అర్జీలను చంద్రబాబు స్వీకరించనున్నారు. 
 
గురువారం నాడు కుప్పం పర్యటనలో మొత్తం పార్టీ కార్యకర్తలు హోరెత్తారు. భారీ జెండాలు పట్టుకుని, ద్విచక్ర వాహనాలపై రోడ్‌ షో పొడవునా బారులు తీరి పయనించారు. జై చంద్రబాబు.. జై తెలుగుదేశం అనే నినాదాలతో పరిసరాలను హోరెత్తించారు. డ్యాన్సులు చేస్తూ ఊరేగింపులు తీశారు. 
 
అంతేకాదు.. చంద్రబాబు కాన్వాయ్‌ వెంట ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా వాహనాల శ్రేణి కనిపించింది. బాబు పర్యటన మొత్తం పసుపు సంద్రం పరవళ్లు తొక్కింది. తొలుత చంద్రబాబుకు కర్ణాటక సరిహద్దు వద్ద నాయకులు, కార్యకర్తలు పెద్దయెత్తున స్వాగతం పలికారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు