ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క క్లిక్‌తో వంద రకాల సేవలు.. ఎలా సాధ్యం?

ఠాగూర్

గురువారం, 24 అక్టోబరు 2024 (11:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వసేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ ద్వారా దాదాపు వంద రకాల సేవలను ప్రజలకు అందివ్వాలని నిర్ణయించింది. వచ్చే నెలాఖరు నుంచి వంద రకాల సేవలను ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి తెచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. రేషన్ కార్డుల జారీ, రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్, పంటల మార్కెట్ ధరలు, దైవదర్శనాలు, విద్యార్థుల హాజరు, ఇలా ఎన్నో రకాలైన సేవలను వాట్సాప్ బిజినెస్ సర్వీస్ వేదిక ద్వారా ఇట్టే పొందేలా వెసులుబాటు తీసుకునిరానుంది. 
 
రాష్ట్రంలో పౌరసేవల డెలివరీ మెకానిజంను సులభతరం చేయడానికిగాను మెటా, ఏపీ ఐటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖల నడుమ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం వల్ల వాట్సాప్ బిజినెస్ సర్వీస్ డెలివరీ ప్లాట్ ఫామ్‌గా పలురకాల పౌరసేవలను ప్రజలకు అందిస్తుంది. వాట్సాప్ మూడు ప్రాథమిక నమూనాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి డెలివరీ ప్లాట్ ఫామ్‌గా ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది.
 
(1). G2C (ప్రభుత్వం నుండి పౌరులకు). (2). B2C (వ్యాపారం నుండి వినియోగదారునికి). (3). G2G (ప్రభుత్వం నుండి ప్రభుత్వం) ఏపీ ప్రభుత్వం 30, నవంబరు, 2024 నాటికి వాట్సాప్ ద్వారా 100 రకాల సేవలను ప్రవేశపెట్టడానికి కంకణబద్ధమై ఉంది. మొదటి దశలో వాణిజ్యరంగంలో సమర్థవంతమైన ప్రభుత్వ సర్వీస్ డెలివరీ కోసం రీ ఇంజనీరింగ్ ప్రక్రియ, విధానాలను అమలు చేస్తారు. రెండోదశలో ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా సులభతరంగా పౌరసేవలు అందిస్తారు. ఈ ప్రక్రియలో, ఈ క్రింది విధంగా వివిధ రకాల సేవలను అందించడానికి ప్రాథమికంగా నిర్ణయించారు.
 
ప్రజలకు అందించే సేవల్లో ఎండోమెంట్, రెవెన్యూ, పౌర సరఫరాలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ అఫైర్, రిజిస్ట్రేషన్, విద్యుత్ శాఖ, పరిశ్రమలు, రవాణా శాఖ, పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయ వ్యవస్థల్లో సమర్థమంతమైన సర్వీస్ డెలివరీ కోసం 29 విభాగాల్లో 350కి పైగా సేవలు ఇప్పటికే ఏకీకృతం చేయడం జరిగింది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు