ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా.. విచారణ జూన్ 21కి వాయిదా
మంగళవారం, 22 మార్చి 2022 (18:18 IST)
తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, టీటీడీ పరువుకు భంగం వాటిల్లేలా ఆంధ్రజ్యోతి పత్రిక 2019, డిసెంబర్ 1న ప్రచురించిన కథనంపై ఆ పత్రికపై టీటీడీ రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతిపై టీటీడీ పరువు నష్టం దావాపై మంగళవారం నాడు తిరుపతి నాలుగో అదనపు జడ్జి కోర్టులో విచారణ జరిగింది.
ఈ విచారణకు టీటీడీ తరఫున న్యాయవాదిగా బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి హాజరయ్యారు. ఇక ఆంధ్రజ్యోతి తరఫు న్యాయవాదిగా క్రాంతిచైతన్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇరువురు న్యాయవాదుల మధ్య వాదోపవాదాలు హోరాహోరీగా సాగాయి. ఇరు వర్గాలు పరస్పరం నోటీసులు జారీ చేసుకున్నాయి. ఈ నోటీసులపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. విచారణను జూన్ 21కి వాయిదా వేసింది.