అభిమన్యు సింగ్ నటించిన సూర్యాపేట జంక్షన్ చిత్రం రివ్యూ

దేవీ

శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (15:09 IST)
Abhimanyu Singh, Eeshwar
ఈశ్వర్, నైనా సర్వర్, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'సూర్యాపేట జంక్షన్' మూవీ ఈ రోజు 25.04.2025 న విడుదల అయింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు, నిర్మాణంలో, రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో పొలిటికల్ కామెడీ డ్రామా చిత్రమని టీమ్ తెలియజేసింది. మరి అదెలా వుందో చూద్దాం.
 
కథ:
ఓ ఊరిలో స్టూడెంట్ అర్జున్‌ (ఈశ్వర్) కాలేజీలో స్కాలర్ షిప్ తో చదువుతుంటారు. తోటివాళ్ళకు పెల్లయినా అర్జన్ తోపాటు నలుగురు ఇంకా ఆ కాలేజీలో చదువుతుంటారు. జ్యోతి (నైనా సర్వర్) ప్రేమలో అర్జున్ పడతాడు. అది ఆమెకు ఇష్టముండదు. కనీసం తల్లిదండ్రుల గురించి ఇంతగా ఆలోచిస్తే నీ చదువుకు సార్థకం అవుతుందనే మాటలు గుండెను తాకుతాయి. ఇక ఆ ఊరిలో వారసత్వంగా ఎం.ఎల్.ఎ. అవ్వాలనుకునే నరసింహ (అభిమన్యు సింగ్)  పేదల ఓట్ల కోసం ఉచితాల పథకాల పేరుతో ఓ పాచిక విసురుతాడు. అప్పటికే ఇతని అరాచకాలను ఎదిరించిన ఈ అర్జున్ గ్యాంగ్ లో ఒకరైన శీను హత్యకు గురవుతాడు.  అసలు శీనును ఎవరు చంపారు? ఆ ఘటన వెనక ఉన్న రాజకీయ కుట్ర ఏంటి? ఉచిత పథకాల వెనుక రహస్యం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా.
 
సమీక్ష:
కాలేజీ చదువు అమ్మాయిల ప్రేమలో పడడం వంటివి సాధారణంగా వున్నా కథలో ముఖ్యమైన  అంశం. రాజకీయ పార్టీలు ఇస్తామనే ఉచిత పథకాలు. ఇటువంటి పథకాలవల్ల యువత, ప్రజలు ఎలా నిర్వీర్యం అయిపోతారనేది ఆసక్తికరంగా వుంది. పుట్టినప్పటినుంచీ పెండ్లి, చావు వరకు ఏదో పథకాలపేరుతో ప్రజలను మభ్యపెట్టే విధానంగా క్లయిమాక్స్ లో వచ్చే డైలాగ్ లు ఆలోచింపజేసేవిగా వున్నాయి. ఒక ఊరి కథగా దర్శకుడు చెప్పినా దేశమంతా  ఇలాగే వుందనేది వాస్తవం.
 
ఇక నుడిగా ఈశ్వర్ అంతకు ముందు నటనానుభవం వుంది. అర్జున్ పాత్రలో సరిపోయాడు. అయితే ఆయనే నిర్మాత కావడంతో బాధ్యతంతా తనపైనే వేసుకోవడంతో కొంత తడబాటు కనిపిస్తుంది. క్లయిమాక్స్ లో తన ఫ్రెండ్ చనిపోయాక ఇంటికివచ్చి ఫొటో చూపిస్తూ పలికే డైలాగ్స్ సినిమాకు హైలైట్. కానీ బ్యాక్ డ్రాప్ లో వున్న ఫొటో లేకుండా చూసుకుంటే ఎమోషనల్ సీన్ కు అర్థం వుండేది. డాన్స్, యాక్షన్ పార్ట్ బాగా చేశాడు. ప్రేమించిన అమ్మాయిని ఆంటీ అని పిలవడం సరికొత్తగా సరదాగా అనిపిస్తుంది.  జ్యోతి పాత్రలో  నైనా సర్వర్  బాగుంది. ఇక ప్రముఖ విలన్ గా నటించిన అభిమన్యు సింగ్ దుష్టుడిగా మెప్పించాడు. కర్ణ పాత్రలో సంజయ్ విలన్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రాజేష్, సూర్య, శీను, టోనీ , ఫ్రెండ్స్ పాత్రల్లో నటించారు. చమ్మక్ చంద్ర, చలాకీ చంటి కాసేపు నవ్వించారు.
 
సాంకేతికంగా పరిశీలిస్తే, ఈశ్వర్ రాసిన కథను రాజేష్ నాదెండ్ల మెప్పించే ప్రయత్నం చేశాడనే చెప్పాలి. చక్కటి సందేశాన్నిచ్చిన ఇటువంటి కథను మరింత జాగ్రత్తలు తీసుకుని చేస్తే పెద్ద సినిమా అయ్యేది. సినిమాకు కెమెరా, సంగీతం ఓకే అనిపించేలా వున్నాయి. అరుణ్ ప్రసాద్ కెమెరా విజువల్‌గా బావుంది. రోషన్ సాలూరి, గౌర హరి ఇచ్చిన సంగీతం బాగా ఆకట్టుకుంది. "మ్యాచింగ్ మ్యాచింగ్" పాట యూత్‌ను ఎట్రాక్ట్ చేసేలా వుంది. మూడు పాటలు, ఒక ఐటెమ్ సాంగ్ కథలో భాగమై వున్నాయి. పరిధిమేరకు నిర్మాణ విలువలతో సినిమా రూపొందించారు నిర్మాతలు.
 
ఏదో బలహీన క్షణంలో రాజకీయనాయకుల మాటలు నమ్మి మోసపోకూడదనే పాయింట్ తో సినిమా తీశారు. ఉచితాల వెనుక ఉన్న రాజకీయాల గురించి అందరికీ తెలిసినా, ముఖ్యంగా యూత్ తలచుకుంటే ఏమి చేస్తారనేది  వినోదంతోపాటు సందేశంతో తీసిని సినిమా ‘సూర్యాపేట జంక్షన్’. ఈ చిత్రాన్ని యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు ఎంతో క్వాలిటీగా నిర్మించారు.
రేటింగ్: 2.75/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు