మనకు అంతా బాగున్నట్టుగానే కనిపిస్తుందని, కానీ ఎన్నికల క్షేత్రానికి వెళ్లిన తర్వాత చిత్తుగా ఓడిస్తారని, అందువల్ల జాగ్రత్తగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి, తన మిత్రుడు, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హితవు పలికారు.
తనతో వచ్చిన వారితో పాటు కేసీఆర్ తనయుడు కేటీఆర్‌ను కూడా బయటకు పంపి కేసీఆర్, జగన్‌లు మాత్రమే ఓ గంట పాటు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. చుట్టుముడుతున్న సమస్యల నుంచి బయటపడి వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడంపై కేసీఆర్ సలహాలు, సూచనలు తీసుకున్నట్టు సమాచారం.
ముఖ్యంగా తెలంగాణాలో బీఆర్ఎస్ ఓటమిని ఊహించలేదని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ వచ్చేదాగా ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత కనిపించలేదని, ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని చెప్పినట్టు సమాచారం.
"అంతా బాగుందనుకున్నాం. కానీ, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక 40 రోజుల్లో పూర్తిగా మార్పు కనిపించింది. ఇది ఊహించని పరిణామం" అని పేర్కొన్నట్టు వినికిడి. అధికారంలో ఉన్న పార్టీపై ప్రజలు తమ వ్యతిరేకతను ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు బయటపెట్టరు.. జాగ్రత్త" అని జగన్‌ను కేసీఆర్ హెచ్చరించినట్టు సమాచారం.