రాజంపేట మండలం బోయనపల్లె దళితవాడలో నివసిస్తున్న కత్తి సుబ్బన్న బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతని రెండో కుమార్తె వాణి జీవనోపాధి కోసం ఒకటిన్నర ఏడాది క్రితం కువైట్కు వెళ్లింది. ఇదే విధంగా జీవనోపాధి కోసం కువైట్ వచ్చిన సుబ్రమణ్యం ఆమెకు పరిచయమయ్యాడు. సుబ్రమణ్యంది కర్నూలు జిల్లా బనగానపల్లె.
వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమ చిగురించింది. దీంతో వీరిద్దరూ అక్కడే వివాహం చేసుకున్నారు. ప్రస్తుతానికి సంతానం లేదు. మూడు నెలల క్రితం వీరు కువైట్ నుండి నేరుగా బోయనపల్లెకు వెళ్లి తమవారిని కలుసుకున్నారు. వీరు వచ్చాక కుటుంబంలో భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు, కుటుంబ కలహాలు వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు.
ఈ పరిస్థితులలో వీరు ఇంటి నుంచి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని బుధవారం కడప శివారులోని కనుమలోపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో బంధువులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకున్నారు. విచారణలో ఆమె తండ్రి సుబ్బన్న ఆత్మహత్యకు గల కారణలు తెలపడానికి ఇష్టపడలేదు.