పెద్దలు తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాలు చివరకు కొందరి జీవితాలతో చెలగాటమాడుతాయి. ఇలాంటి సంఘటనే ఒకటి హైదరాబాద్‌లో జరిగింది. ఒకరినొకరు ఇష్టపడిన బావామరదళ్ళను ఒక్కటి చేసేందుకు ఇరు కుటుంబాల పెద్దలు సమ్మతించలేదు. పైగా ఆ యువతికి మరో వ్యక్తితో బలవంతంగా వివాహం చేశారు. అయితే, మరదలిపై మనసు పారేసుకున్న బావ.. ఆమె ఎడబాటును జీర్ణించుకోలేక వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చివరకు ఆమె భర్త కంటపడటంతో కటకటాలపాలయ్యాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
హైదరాబాద్, బీఎన్ రెడ్డినగర్‌కు చెందిన శ్రీశైలం (22) అనే వ్యక్తి ఓ చికెన్ సెంటర్లో పని చేస్తున్నాడు. చంపాపేటలోని మారుతీనగర్‌కి చెందిన పద్మ (20)తో రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి సంతానం లేదు. అయితే, పద్మకు మల్లేశం (21) అనే బావ ఉన్నాడు. ఈయన నల్గొండ జిల్లా అరగన్లపల్లి నివాసి. అయితే, దిల్సుఖ్నగర్ పరిధి మధురాపురిలోని ఓ హోటల్లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు.
అయితే, మల్లేశాన్ని అనుమానించిన శ్రీశైలం.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... మధురాపురిలో విచారించగా పద్మ, మల్లేశంలు ఒకే ఇంటిలో ఉన్నట్టు గుర్తించారు. తనకు భర్తతో ఉండటం ఇష్టంలేదని అందుకే బావ మల్లేశంతో ఉంటానని తెగేసి చెప్పింది. దీంతో పద్మను ఆమె తల్లికి అప్పగించి, మల్లేశంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.