కాలేజీల్లో వసతులు, విద్యాబోధన బాగా లేకపోతే ప్రశ్నించవచ్చు..ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు 1902: జగన్‌

మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (19:03 IST)
రాష్ట్ర విద్యా రంగంలో మరో గొప్ప కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా ‘జగనన్న విద్యా దీవెన’పథకం ప్రారంభించింది.

ఇచ్చన మాటమేరకు కరోనాలాంటి కష్టకాలంలో కూడా సీఎం వైయస్‌.జగన్‌ సంపూర్ణ ఫీజు రియింబర్స్‌ మెంట్‌పథకాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం క్యాంప్‌ కార్యాలయంలో పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన జల్లాల కలెక్టర్లు, విద్యార్థులు, వారి తల్లులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1880 కోట్లతో సహా, ఈ ఏడాది మార్చి 31 వరకు అన్ని కాలేజీలకు పూర్తి ఫీజులు చెల్లిస్తూ రూ.4 వేల కోట్లకు పైగా నిధులను ఒకేసారి విడుదలచేస్తూ చరిత్ర సృష్టించింది. 
 
పేదరికం వల్ల ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదని, పిల్లల చదువుల కోసం కుటుంబం అప్పుల పాలు కాకూడదని, పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి చదువు ఒక్కటే అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. అందుకే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లుల ఖాతాల్లోనే ఈ మొత్తం జమ చేస్తారు. తద్వారా ఆ తల్లులకూ బాధ్యత, జవాబుదారీతనం ఉంటుందని, కాలేజీల్లో వసతులు, విద్యాబోధన బాగా లేకపోతే ప్రశ్నించడంతో పాటు, ఆ విషయాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు 1902 నెంబర్‌ కూడా ఏర్పాటు చేస్తున్నామని సీఎం వైయస్‌ జగన్‌ తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
 
ముఖ్యమంత్రి ఏమన్నారంటే...!
ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభించడం అంటే చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఈ పథకం ద్వారా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు నాన్నగారి హయాంలో మొట్టమొదటగా 2004లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక, అంతకు ముందు ఎవ్వరూ చేయని ఆలోచన చేశారు.

పేదరికం అన్నది పోవాలంటే కచ్చితంగా కుటుంబం నుంచి పెద్ద చదువులు చదవగలిగితేనే, ఆ చదువుల కోసం ఏ ఒక్కరు కూడా అప్పులపాలు కాకుండా తమ పిల్లలను చదివించగలిగితేనే, ఆ పిల్లలు పెద్ద చదువులు చదివి, ఇంజనీర్లు అయి, డాక్టర్లు అయి, కలెక్టర్‌ వంటి పెద్ద చదువులు చదివితేనే పేదవారి తలరాతలు  మారుతాయని, అప్పుడే వారి బతుకులు కూడా మారుతాయని, గతంలో ఎవ్వరూ కూడా చేయని విధంగా ఆలోచన చేసి అప్పట్లో నాన్నగారు పిల్లలను చదివించడం కోసం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అన్న పథకం తీసుకురావడం అన్నది జరిగింది.

రాష్ట్రంలో నాన్నగారు ఉన్నప్పుడు ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కానీ, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కానీ ఒక భరోసా ఉండేది. తమ బతుకులు మారుతాయి. తమ తలరాతలు మారుతాయి. ముఖ్యమంత్రి స్థానంలో ఒక మనసున్న మహరాజు ఉన్నాడని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక భరోసా ఉండేది’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వెల్లడించారు.
 
నీరుగార్చారు... 
‘అయితే 2009లో నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ పథకాన్ని పూర్తిగా నీరు గారుస్తూ పోయారు. చివరకు ఏ స్థాయిలోకి ఈ పథకాన్ని నీరు గారుస్తూ పోయారు అంటే, చాలీచాలని ఫీజులు ఇవ్వడం, ఇచ్చామంటే ఏదో ఇచ్చామన్నట్లుగా ఫీజులు ఇవ్వడం, ఫీజులు ఎలా ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేయకుండా, ఫీజులు ఎలా కత్తిరించాలి అని చెప్పి, పిల్లల సంఖ్యను ఎలా కత్తిరించాలి అని చెప్పి ఆలోచన చేయడం.. ఇలా రకరకాల షరతులు పెట్టి, రకరకాల పద్ధతులు పెట్టి చాలీచాలని ఫీజులు ఇస్తూ, ఏకంగా ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఏ స్థాయిలోకి నీరు గార్చారు అంటే.. నాకు బాగా గుర్తుంది’ అంటూ తన పాదయాత్రలో చోటు చేసుకున్న ఒక సంఘటనను సీఎం ప్రస్తావించారు.
 
ఏనాటికీ మర్చిపోలేను...
‘నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు, నెల్లూరు జిల్లాలో నా పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో గోపాల్‌ అనే వ్యక్తి తన ఇంటి ముందు. తన కొడుకు ఫోటో పెట్టి, ఫ్లెక్సీ కట్టాడు. ఆయన నా దగ్గరకు వస్తే, ఈ ఫ్లెక్సీ కట్టారు ఏమిటి? అని అడిగాను. అప్పుడు తను బాధ పడుతూ చెప్పిన మాటలు నేను ఎప్పుడూ మర్చిపోలేను.

నా కొడుకు బాగా చదివాడు. ఇంటర్‌లో మంచి మార్కులు వచ్చాయి. ఇంజనీరింగ్‌ చుదువుతానంటే కాలేజీలో చేర్పించాను. కానీ అక్కడ ఫీజులు చూస్తే, దాదాపుగా బోర్డింగ్, మెస్‌ ఛార్జీలు దాదాపు లక్ష రూపాయలు కట్టాలి. కానీ ప్రభుత్వం మాత్రం రూ.30 వేలు లేక రూ.35 వేలు మాత్రమే ఇస్తోంది. మరి మిగిలిన ఫీజు ఎలా కడతారని ఆ పిల్లవాడు అడిగితే, ఏదో ఒక విధంగా కడతానని ఆ తండ్రి చెప్పాడు.

కాలేజీలో చేరిన పిల్లవాడు మొదటి ఏడాది పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు. మళ్లీ రెండో సంవత్సరం చాలీచాలని ఫీజులు మాత్రమే ప్రభుత్వం ఇస్తా ఉంది. మిగిలిన ఫీజు పరిస్థితి ఏమిటి అని చెప్పి మళ్లీ అదే పిల్లాడు అడిగాడు. ఏదో ఒకటి చేస్తాను. నువ్వైతే బాగా చదువు అని చెప్పి పంపించాను’ అంటూ ఆ తండ్రి నాతో అన్నాడు. 

‘తర్వాత ఆ పిల్లవాడు కాలేజీకి వెళ్లి, తన చదువుల కోసం తన తండ్రి అప్పుల పాలవడం, చూడలేక కొవ్వొత్తిలా తన తండ్రి, తన కుటుంబ కరిగి పోవడం చూసి తట్టుకోలేక ఆ పిల్లవాడు ఆత్మహత్య చేసుకున్నాడు’ అని ముఖ్యమంత్రి వివరించారు.
 
అసలు ఎందుకీ పరిస్థితి?
ఆ తండ్రి ఆ విషయం చెప్పి ఎంతో బాధ పడ్డాడు అన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, నిజంగా పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, అందుకు రెండే రెండు కారణాలని చెప్పారు. ఒకటి చదువు అయితే రెండోది ఆ పేదవాడికి అనుకోకుండా అనారోగ్యం ఏదైనా వస్తేనే వారు అప్పుల పాలవుతారని అన్నారు. 
 
అప్పుడు వచ్చింది ఈ ఆలోచన
ఈ రెండు కారణాల వల్ల పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి ఆరోజు నిజంగా తన మనసు చాలా కలత చెందిందని, ఆరోజు తాను అనుకున్న ఆ కార్యక్రమాన్ని ఈరోజు దేవుడి దయ, అందరి ఆశీర్వాదంతో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడమే కాకుండా మరొక అడుగు ముందుకు వేశామని చెప్పారు.

‘ఇదే కాకుండా వసతి దీవెన అని చెప్పి, పిల్లలకు బోర్డింగ్‌ అండ్‌ లాడ్జింగ్‌ ఖర్చుల భారం తల్లిదండ్రుల మీద పడకుండా ఈరోజు వసతి దీవెన, విద్యా దీవెన అని చెప్పి రెండు పథకాలు తీసుకురావడం, వసతి దీవెన అన్నది ఆల్రెడీ మొన్న జనవరిలోనే స్టార్ట్‌ చేయడం, విద్యా దీవెన అన్న పథకం ఈరోజు ప్రారంభించడమే కాకుండా గొప్పగా ఈ కార్యక్రమాన్ని అడుగులు ముందుకు వేయించడం దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో ముందుకు వెళ్లడం నిజంగా చాలా ఆనందం కలిగిస్తోందని చెబుతా ఉన్నా’ అని సీఎం అన్నారు.
 
ఏమిటీ ఈ కార్యక్రమం?
‘ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మతో నాలుగు మాటలు పంచుకుంటున్నాను. పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అంటే, అది చదువులు అన్నది వేరే చెప్పాల్సిన పని లేదు. కుటుంబం నుంచి ఒక్క పిల్లాడన్నా ఇంజనీరో, డాక్టరో లేదా కలెక్టర్‌ వంటి ఏ పెద్ద చదువులు చదివినా కూడా పెద్ద జీతాలు వస్తాయి. ఆ పిల్లాడు బాగా చదవడం వల్ల ఇంటికి కాస్తో కూస్తో డబ్బులు పంపించగలుగుతాడు. మన బతుకులు మారుతాయి అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలిసిన విషయమే’ అని సీఎం వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.
 
రాష్ట్ర చరిత్రలో తొలిసారి
ఈ దిశగా అడుగులు వేస్తూ మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా టోటల్‌గా మార్చి 31 వరకు కూడా బకాయిలు ఒక్క రూపాయి కూడా బకాయి పెట్టకుండా ఇవ్వగలిగామని, ఇది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని అంశం అని ముఖ్యమంత్రి తెలిపారు.

‘2018–19 సంవత్సరానికి అంటే గత ప్రభుత్వం ఫీజుల రీయింబర్స్‌మెంట్‌లో పెట్టిన బకాయిలు.. దాదాపు రూ.1880 కోట్ల గత ప్రభుత్వం బకాయిలు కూడా మనం ఫీజులు కడుతూ, కట్టడమే కాకుండా ఈ సంవత్సరం అంటే 2019–20 సంవత్సరం అంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే ఫీజులు ఈ నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన ఫీజులు, మొత్తం మార్చి 31వ తేదీ వరకు కూడా పూర్తిగా మొత్తం రూ.4 వేల కోట్లకు పైగా ఈ పథకం కోసం ఖర్చు చేస్తూ ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా పూర్తిగా కట్టగలిగాము అని చెప్పి గర్వంగా కూడా చెబుతా ఉన్నా. రాష్ట్ర చరిత్రలో ఇది ఎప్పుడూ జరగని విధంగా చేశామని చెప్పి కూడా గర్వంగా చెబుతా ఉన్నా’ అని ముఖ్యమంత్రి వివరించారు.
 
మరొక అడుగు
‘ఈ కార్యక్రమంలో ఒక అడుగు ముందుకు కూడా తీసుకుపోతా ఉన్నాం. కాలేజీ యాజమాన్యాలకు ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా పూర్తిగా ఫీజులు చెల్లించాం కాబట్టి, ఈ çపథకాన్ని ఒక అడుగు ముందుకు తీసుకుపోతా ఉన్నాం. వచ్చే జూన్‌లో కాలేజీలు తిరిగి తెరుస్తారు. ఆ కాలేజీల్లో కొత్తగా చేరే వారు చేరుతారు. ఆల్రెడీ అడ్మిషన్‌ పొందిన వారు కాలేజీలకు వస్తారు. మళ్లీ కొత్తగా 2020–21 విద్యా సంవత్సరం మొదలవుతుంది’.

‘ఆ మొదలయ్యే సంవత్సరానికి సంబంధించి టోటల్‌గా ప్రతి త్రైమాసికం ఫీజును తల్లి ఖాతాలోనే వేస్తాం. ఆ తల్లులు కాలేజీలకు వెళ్లి, వాళ్లే ఆ ఫీజులు కట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం’ అని సీఎం వైయస్‌ జగన్‌ వెల్లడించారు.
 
ఏమిటి ప్రయోజనం?
‘ఎందుకీ కార్యక్రమం చేస్తా ఉన్నాం అంటే, ఎప్పుడైతే తల్లులు ఫీజులు కట్టడం మొదలు పెడతారో అప్పుడు కాలేజీ యాజమాన్యాలను తల్లులు అడగగలుగుతారు. ఎందుకంటే తల్లులే ఆ ఫీజులు కడుతు ఉన్నారు కాబట్టి, ఆ కాలేజీలో సదుపాయాలు బాగా లేకపోయినా, ఆ కాలేజీలో టీచింగ్‌ స్టాఫ్‌ బాగా లేకపోయినా, ఇంకొకటైనా, ఇంకొకటైనా ఆ కాలేజీ యాజమాన్యాలను ఆ తల్లులు ప్రశ్నించే అవకాశం వస్తుంది’.

‘అదొక్కటే కాకుండా తల్లులు ప్రతి మూడు నెలలకు ఒకసారి నేరుగా ఫీజులు వారే కడితే, మన పిల్లలు ఎలా చదువుతున్నారు?. హాజరు ఉందా?. కాలేజీకి వెళ్తున్నారా? లేదా? అన్న విషయం కూడా తెలుసుకోగలుగుతారు. దీని వల్ల ఆత్మగౌరవం పెరుగుతుంది. మనమే కాలేజీల ఫీజులు కడుతా ఉన్నాం కాబట్టి, ప్రశ్నించగలుగుతాం. ఈ మార్పు కూడా చేయగలుగుతా ఉన్నాము అని చెప్పి ధైర్యంగా కూడా నేను చెబుతా ఉన్నాను’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
 
యాజమాన్యాలకు భరోసా
‘ఒక్క రూపాయి కూడా బకాయి పెట్టకుండా కాలేజీ యాజమాన్యాలకు కట్టాల్సిన ఫీజులన్నీ కట్టేశాం కాబట్టి, కాలేజీ యాజమాన్యాలు కూడా «ధైర్యంగా.. ఓకే ఈ ప్రభుత్వం పిల్లల చదువులకు కట్టుబడి ఉంది. కచ్చితంగా ఈ ప్రభుత్వం మా ఫీజుల్లో ఎటువంటి జాప్యం చేయదు అని చెప్పే నమ్మకం కాలేజీ యాజమాన్యాలకు కూడా ఇస్తాం. ఇది ఒక కొత్త ఒరవడికి నాంది పలుకుతుంది అని చెప్పి కూడా ఈ వేదిక నుంచి సగర్వంగా తెలియజేస్తా ఉన్నా’ అని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు.
 
‘పిల్లల కోసం వసతి దీవెన అని చెప్పి ఇంతకు ముందు జనవరిలో ప్రారంభించాం. సంవత్సరానికి రెండు సార్లు.. జనవరి.. ఫిబ్రవరిలో ఒకసారి, మళ్లీ జూలై.. ఆగస్టులో మళ్లీ రెండో సారి. పిల్లలకు వసతి కోసం, సంవత్సరానికి ప్రతి పిల్లవాడికి రూ.20 వేలు ఇస్తాం రెండు దఫాల్లో. ఇప్పటికే ఒక దఫా రూ.10 వేలు ఇవ్వడం జరిగింది. మళ్లీ జూలై.. ఆగస్టులో మిగిలిన రూ.10 వేలు తల్లుల ఖాతాలో వసతి దీవెనలో ఇవ్వడం జరుగుతుంది’ అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
 
కరోనా కష్టాలున్నా!
‘ఈ వసతి దీవెన, విద్యా దీవెన ఈ రెండింటి వల్ల ఈ తల్లి కూడా తమ పిల్లలను చదివించడం కోసం అప్పులపాలు కాకుండా, ఏ మాత్రం కష్టపడకుండా తమ పిల్లలను గొప్పగా చదివించగలుగుతారన్న నమ్మకం, విశ్వాసంతో ఈ గొప్ప కార్యక్రమానికి కరోనా కష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతా ఉన్నామని చెప్పి ప్రతి తల్లికి తెలియజేస్తా ఉన్నా’ అని చెప్పారు. 
 
ఇప్పటికే చెల్లిస్తే ?
‘ప్రతి తల్లికి ఇంకొక విషయం చెప్పాల్సి ఉంది. గడచిన సంవత్సరాల్లో అడ్మిషన్‌ తీసుకున్న వారికే కాకుండా, పై తరగతి చదువుతున్న విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తా ఉన్నాం. కాబట్టి 2019–20లో మీరు ఏదైనా కాలేజీకి ఫీజు లేదా స్పెషల్‌ ఫీజు.. కాలేజీలకు కూడా ఒకటే చెప్పాం. ఫీజు అనేది ఒక్కటే.. ఫీజు, స్పెషల్‌ ఫీజు అని చెప్పి తీసుకోవడానికి వీలు ఉండదు. ఏదైనా కూడా ప్రభుత్వమే కడుతుంది.

స్పెషల్‌ ఫీజులు ఉండవు అని చెప్పి కాలేజీ యాజమాన్యాలకు చెప్పడం కూడా జరిగింది. ఈ 2019–20 సంవత్సరం, మనం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంలో వాళ్ల పిల్లల కోసం ఏదైనా ఫీజులు కానీ కట్టి ఉంటే, కాలేజీ యాజమాన్యాలు పిల్లలు, వారి తల్లిదండ్రుల నుంచి ఫీజులు ఏమైనా తీసుకుని కానీ ఉంటే, ఇప్పుడు కాలేజీ యాజమాన్యాలకు మనం పూర్తి ఫీజులు చెల్లిస్తున్నాం కాబట్టి, రూపాయి కూడా బకాయి లేదు కాబట్టి ఆ కాలేజీ యాజమాన్యాలు తల్లులకు ఆ ఫీజులు వెనక్కు ఇవ్వాలి’.

‘కాలేజీ యాజమాన్యాలు, తల్లులకు ఈ మేరకు లేఖలు రాశాము. గ్రామ వలంటీర్ల ద్వారా రేపో మాపో ఆ లేఖలు అందుతాయి. ప్రభుత్వం పూర్తి ఫీజు చెల్లించింది కాబట్టి, ఇప్పటికే కాలేజీలు ఏమైనా ఫీజు తీసుకుని ఉంటే, ఆ ఫీజు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది’.

‘బై ఛాన్స్‌.. ఎక్కడైనా కాలేజీలు ఆ ఫీజులు తిరిగి ఇవ్వకపోతే.. ఆ తల్లులకు రాసిన లేఖలో ఒక నెంబరు: 1902 రాశాము. ఆ నెంబరుకు ఫోన్‌ చేస్తే ప్రభుత్వమే స్పందించి, కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడి, ఆ మొత్తం రాబట్టే ప్రయత్నం చేస్తుంది’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
 
అడిగే హక్కు కలుగుతుంది
‘2020–21 విద్యా సంవత్సరం నుంచి ఫీజులను తల్లులే కడతారు కాబట్టి, ఆ కాలేజీలో సౌకర్యాలు లేవు. ఇంప్రూవ్‌మెంట్‌ లేదు. ఆ సదుపాయాలు బాగు పర్చాలి అని చెప్పి ఆ తల్లికి కానీ అనిపిస్తే అదే 1902 నెంబర్‌. ఎప్పుడూ కూడా ఆ నెంబరు గుర్తు పెట్టుకోమని చెప్పి ఆ తల్లికి కూడా చెబుతా ఉన్నాం. ఆ నెంబరు ఎప్పటికీ కూడా యాక్టివేషన్‌లోనే ఉంటుంది. మీకు ఏదైనా కాలేజీలు బాగు పర్చాలి.

కాలేజీల్లో సదుపాయాలు బాగా లేవు అని చెప్పి అనిపిస్తే, ఆ 1902కు ఆ తల్లి ఫోన్‌ చేసి చెప్పొచ్చు. ఉన్నత విద్యా శాఖలో ఆ కాల్‌ సెంటర్‌ పెట్టడం జరుగుతా ఉంది.. విత్‌ సీఎం ఆఫీస్‌ సూపర్‌విజన్‌. కాబట్టి తల్లులు ఫిర్యాదు చేసిన వెంటనే ప్రభుత్వం యాక్టివేట్‌ అవుతుంది. కాలేజీ యాజమాన్యాలు ఆ పరిస్థితులను ఇంప్రూవ్‌ చేసే విధంగా కూడా అడుగులు వేస్తా ఉన్నాం’.

‘అప్పుడు కాలేజీలో పరిస్థితులు, వ్యవస్థ కూడా బాగు పడుతుంది. తల్లులకు జవాబుదారీతనం కూడా వస్తుంది. తల్లులు ఫీజులు కట్టే విషయంలో ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితి కూడా వస్తుంది’ అని సీఎం పేర్కొన్నారు.
 
చివరగా..
‘మీ పిల్లలను గొప్పగా చదివించండి. అన్ని రకాలుగా ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కుటుంబ సభ్యుడిగా ప్రతి తల్లికి చెబుతా ఉన్నా నేను ఈరోజు. మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు ఈ స్థానంలో ఉన్నాడు. అన్ని రకాలుగా మీ పిల్లలను చదివిస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉనా’ అంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగం ముగించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు