మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ఏం జరుగబోతుందోనన్న అంశంపై జేసీ జోస్యం చెప్పారు. అసెంబ్లీలో రేపు ఏమీ జరగదని, అవసరమైతే టీడీపీ ఎమ్మెల్యేలను బయటకు పంపి... ప్రభుత్వానికి అవసరమైన బిల్లులు పాస్ చేసుకుంటారని చెప్పారు.
ఇదేసమయంలో వైసీపీ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. కేసులు ఉన్నా, లేకపోయినా ఇబ్బంది పెట్టాలనేదే వైసీపీ లక్ష్యంగా ఉందన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల పేర్లు ఎఫ్ఐఆర్‌లో లేవని... అయినా అరెస్టు చేశారని అన్నారు. తనపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి కేసు లేదని... అయినప్పటికీ, ఏదో ఒక కేసు పెట్టి తనను కూడా లోపల పడేస్తారని వ్యాఖ్యానించారు.
ఇకపోతే, వాహనాలను అమ్మిన వారిని, రిజిస్ట్రేషన్ చేసిన అధికారులను వదిలేసి... తమ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టారని దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. తమ కుటుంబంపై ఎంతటి ప్రేమాభిమానాలు ఉన్నాయో చెప్పేందుకే నారా లోకేశ్ తమ ఇంటికి వచ్చారని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.