బీజేపీకి ఆ భయం వుండొచ్చు.. ముఖేష్ అంబానీలాంటి వ్యక్తే?: జేసీ

బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (15:08 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చూసి బీజేపీకి భయం వుండొచ్చునని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే..? గతంలో సీఎం చంద్రబాబు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారనే విషయాన్ని జేసీ గుర్తు చేశారు. థర్డ్ ఫ్రంట్‌లో ఆయన కీలకంగా వున్నారని... ప్రధానమంత్రులను ఆయనే తయారు చేశారంటూ జేసీ తెలిపారు. మళ్లీ అలాంటివి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో బాబు పట్ల బేజీపీ కాస్త మెతకవైఖరిని అవలంబిస్తోందని జేసీ చెప్పారు. 
 
ప్రస్తుతం సీఎం స్థాయిలో వున్న చంద్రబాబు ఉన్నత స్థాయికి చేరుకోవాలని సాక్షాత్తు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీలాంటి వ్యక్తే కోరుతున్నారని జేసీ వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే అన్ని పార్టీల మద్దతు కోరామని.. ప్యాకేజీ పేరుతో ఏపీకి కేంద్రం నిధులు ఇస్తుందనే నమ్మకం లేదన్నారు.
 
వైకాపా చీఫ్ జగన్ తన ఎంపీలతో ఏప్రిల్‌లో రాజీనామాలు చేయించినంత మాత్రాన ఆయా స్థానాలకు ఉపఎన్నికలు జరగవని తక్షణమే రాజీనామాలు చేయిస్తే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అందుకే దమ్ముంటే ఇవాళే జగన్ తన ఎంపీలను రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. ఇక టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు రాజీనామాలు చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదని.. వీళ్ల స్థానంలో బీజేపీ వాళ్లకు కేంద్ర మంత్రి పదవులు వస్తాయని చెప్పుకొచ్చారు. 
 
కేంద్రంలో తమ నిరసన కార్యక్రమాల తర్వాత కేంద్రంలో కదలిక వచ్చిందని.. లోక్‌సభలో ఎంపీల తీరు జుగుప్సాకరంగా వుందని బీజేపీ నేత విష్ణుకుమార్ చేసిన వ్యాఖ్యలపై జేసీ స్పందించారు. లోక్ సభలో చిత్తూరు ఎంపీ ప్రసాద్ కళాకారుడని.. అందుకే ఆ విధంగా తన నిరసన వ్యక్తం చేశారని జేసీ వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు