చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా? ఎవరు?
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (21:50 IST)
ఏం చెప్పాలనుకున్నా ముక్కుసూటిగా చెప్పే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ నాయుడుని పరామర్శించిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. రాజకీయాల నుంచి తప్పుకొని ఎన్జీవో ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేస్తానని ప్రకటించారు.
ఇటీవల పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జుల విషయంలోనూ జేసీ కీలక వ్యాఖ్యలు చేశారు. పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.
అనంతపురం జిల్లా నేత సైకం శ్రీనివాసరెడ్డిని టీడీపీ కార్యకర్తలకు పరిచయం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తూనే మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.
శ్రీనివాస్ రెడ్డి మచ్చలేని నాయకుడంటూనే ఈసారి పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ విజయం సాధిస్తుందని జేసీ జోక్యం చెప్పారు.
పార్టీ అధిష్టానం పాతవారికి కాకుండా కొత్తవారికి టికెట్ ఇస్తేనే గెలుపు సాధ్యమన్న జేసీ.. తన కుమారుడి కంటే మంచి వ్యక్తికి టికెట్ ఇచ్చినా సపోర్ట్ చేస్తానని ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. జేసీ కామెంట్స్ పై అప్పట్లో టీడీపీలో దుమారం రేగింది.