ఆ తర్వాత కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌తో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అనుమతినిచ్చిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు ఆంధ్ర ప్రదేశ్ శాసన సభాపతి డా. కోడెల శివప్రసాద రావు ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, స్వచ్చ భారత్, స్వచ్చ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమాలను, సత్తెనపల్లి నియోజకవర్గంలో చేపట్టిన స్వచ్చ భారత్, స్వర్గపురి కార్యక్రమాలను కేంద్రమంత్రికి వివరించారు.
సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయంలో ఈ విద్యా సంవత్సరంలో కొన్ని రిజర్వుడు కేటగిరి సీట్లు భర్తీ కాలేదని, వీటిని సాదారణ కేటగిరి సీట్లుగా పరిగణించి భర్తీ చేయుటకు అవరోధంగా వున్న నిబంధనలను సడలించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేస్తూ మెమొరాండంను సమర్పించారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ సత్వరమే తగు చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్రమోడి స్వచ్చ భారత్ పిలుపు స్పూర్తితో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన స్వచ్చాంధ్ర ప్రదేశ్ కార్యక్రమము ప్రజల సహకారంతో సత్ఫలితాలను సాధిస్తున్నామని చెప్పారు.
ఇదే స్పూర్తితో గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో 3500 వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి బహిరంగ మలవిసర్జన నిర్మూలనరహిత నియోజకవర్గంగా తీర్చిదిద్ది స్వచ్చ భారత్ కార్యక్రమానికి స్పూర్తిగా నిలిపామని కేంద్రమంత్రికి వివరించారు. కులమత రహితంగా అన్నివర్గాలవారికి వున్న 400 స్మశానాలను గుర్తించి “స్వర్గపురి” స్వర్గాదామాలుగా తీర్చిదిద్దామని ఇందుకు సంబంధించిన ఆల్బంను కేంద్ర మంత్రికి సమర్పించారు.
అనంతరం పాత్రికేయులతో స్పీకర్ డా. కోడెల శివప్రసాద రావు మాట్లాడుతూ నవంబరు నెలలో డాకాలో జరుగనున్న కామన్ వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌ను పురస్కరించుకుని లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన పార్లమెంట్ అనేక్సిలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు అయ్యేందుకు ఢిల్లీ విచ్చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గౌ. శ్రీ వెంకయ్య నాయుడును, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కలసినట్లు చెప్పారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయంలో ఈ విద్యాసంవత్సరం భర్తీకాని రిజర్వుడు కేటగిరి సీట్లను సాధారణ కేటగిరిలో లాటరీ విధానం ద్వారా భర్తీచేయుటకు అంగీకరించిన కేంద్ర మంత్రికి కృతఙ్ఞతలు తెలిపారు.
కోటప్ప కొండను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే నేపద్యంలో అవసరమైన పర్యావరణ అనుమతులు, నిధులు మంజూరు చేయాలని మంత్రివర్యులకు, అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ వర్షాకాల, శీతాకాల సమావేశాలు రెండూ కలిపి ప్రభుత్వ అనుమతితో నవంబరు మొదటి వారం నుంచి సుమారు 10 రోజులపాటు జరుపనున్నట్లు పాత్రికేయులడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పీకర్ డా. కోడెల శివప్రసాద రావు వెల్లడించారు.