వారికి ఇంగ్లీష్ రాకకాదని, అది వారి భాషపై ఉండే అభిమానమన్నారు. తెలుగు భాషను తప్పని సరిచేశారు కాబట్టి కేసీఆర్‌ని ప్రశంసిస్తున్నానని, ఇంతకు ముందున్న ముఖ్యమంత్రులు ఎవ్వరూ చేయలేనిది కేసీఆర్ చేశారని, గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. మనమంతా మాతృభాషను మర్చిపోతున్నామని, మన భవిష్యత్ తరాలు తెలుగు భాష తియ్యదనాన్ని అనుభవించాలని అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోతే ఇది సాధ్యపడదన్నారు.
కేసీఆర్ భాషాప్రియుడని, తెలుగు భాషపై, సాహిత్యంపై చక్కటి పట్టున్న వ్యక్తి కావడంతో తెలుగుభాషను కాపాడటానికి మంచి నడుం బిగించారన్నారు. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు తెలుగుభాషను తప్పనిసరి చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును అభినందిస్తున్నానని చెప్పారు.
ఇకపోతే.. ఏఎన్నార్ జాతీయ పురస్కారాన్ని రాజమౌళికి ఇవ్వడం సముచితం. తెలుగుతోపాటు భారతీయ కీర్తిపతాకను ప్రపంచపటంలో మొదటిసారి గర్వంగా తలెత్తుకునేలా చేసిన అసమాన ప్రతిభాశీలి రాజమౌళి అని కొనియాడారు. విలక్షణ మహానటుడిగా గుర్తింపును తెచ్చుకున్న అక్కినేని నాగేశ్వరరావు పేరిట నెలకొల్పిన అవార్డును.. మహాదర్శకుడు రాజమౌళికి ప్రదానంచేయడం మరిచిపోలేని ఘట్టంగా భావిస్తున్నానన్నారు.
భాష, సంస్కృతులు, వారసత్వాలను నిలబెట్టుకోవడానికి సినిమా మంచి సాధనంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఎన్టీఆర్, అక్కినేని, శివాజీ గణేశన్ వంటి నటులు ప్రస్తుతం తగ్గిపోయారని చెప్పారు. రోజురోజుకు సృజనాత్మకత తగ్గి.. జుగుప్సాకరమైన, యాంత్రికమైన, చౌకబారు, మూసధోరణితో కూడిన సినిమాలు వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు దర్శకనిర్మాతలు తమ సృజనాత్మకతను హింస, నేరాలు, అసభ్యత చూపించేందుకు ఉపయోగించి, సినిమా విజయవంతం కావడమే పరమావధిగా పెట్టుకున్నారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.