వచ్చే వారంలో పిఠాపురానికి పవన్ కళ్యాణ్ - 3 రోజుల పాటు గ్రామస్థాయిలో సమీక్షలు

ఠాగూర్

మంగళవారం, 19 మార్చి 2024 (10:31 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేయనున్న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడే ఉంటూ గ్రామస్థాయిలో జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులను సమాయాత్తం చేయనున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ ప్రకటన వెలువడిన తర్వాత ఆయన పిఠాపురంలో పర్యటించడం ఇదే తొలిసారి. పైగా, నియోజకవర్గానికి వస్తున్న పవన్‌కు కనీవినీ రీతిలో స్వాగతం పలికేందుకు పార్టీలకు అతీతంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు సిద్ధమవుతున్నారు. 
 
అలాగే, పిఠాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వర్మ సైతం పార్టీ అధినేత చంద్రబాబు బుజ్జగింపులతో వెనక్కి తగ్గి... పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పవన్‌ను గెలిపించే బాధ్యతను వర్మ తన భుజాలపై వేసుకున్నారు. దీంతో ఆయన గత రెండు రోజులుగా నియోజవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణులతో పాటు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యతలను కూడా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకు ఉద్బోధిస్తున్నారు.
 
అలాగే తనకు పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీని కూడా టీడీపీ నేతలు, తన అనుచరులకు ఆయన వివరిస్తూ వారిని శాంతపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి రానున్న పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికేందుకు, ఆయనతో కలిసి అడుగులు వేసేందుకు వర్మతో పాటు మూడు పార్టీల నేతలు, పిఠాపురం ప్రజలు సిద్ధమవుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు