పోలవరం ప్రాజెక్టు పనుల్ని ఈ ఏడాది చివరి కల్లా ఎట్టి పరిస్దితుల్లోనూ పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్న ఏపీ ప్రభుత్వం.. ఈ వర్షాకాలంలో పనులకు అంతరాయం లేకుండా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గోదావరికి వచ్చే వరద నీటిని మళ్లించేందుకు ఈసారి పకడ్బందీ ప్రణాళిక సిద్దం చేసింది. గతంలో వరద నీటి కారణంగా పనులకు ఆటంకం కలగడంతో ఈసారి అలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది.
పోలవరం స్పిల్‌వే నుంచి ఈ వర్షాకాలంలో వరద నీరు మళ్లించేందుకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు. గోదావరి నదీ ప్రవాహాన్ని ఎడమవైపు నుంచి కుడివైపుకు అధికారులు మళ్లిస్తున్నారు. దీని ద్వారా అప్రోచ్ ఛానల్ నుంచి స్పిల్‌వే మీదుగా స్పిల్ ఛానల్ వరకూ వెళ్లి అక్కడి నుంచి మరలా పైలట్ ఛైనల్ నుంచి సహజ ప్రవాహంలో గోదావరి నది కలవబోతోంది.