పోలీసులు దిగ్బంధంలో అమరావతి : ర్యాలీకి అనుమతి నిరాకరణ

ఆదివారం, 8 ఆగస్టు 2021 (12:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో కఠిన అంక్షలు అమలవుతున్నాయి. రాజధాని పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు బయటి వారిని లోనికి రాకుండా అడ్డుకుంటున్నారు. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమానికి నేటితో 600 రోజులు పూర్తయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో హైకోర్టు నుంచి మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించాలని రైతులు, మహిళలు నిర్ణయించారు. ఈ ర్యాలీకి అనుమతి నిరాకరించిన పోలీసులు అమరావతి, పరిసర గ్రామాల్లో పోలీసులను భారీగా మోహరించారు.
 
ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులను పరిశీలించి స్థానికులను మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. మీడియాకు కూడా అనుమతి నిరాకరించారు. అలాగే, విజయవాడ - అమరావతి మార్గంలోనూ ఆంక్షలు అమలవుతున్నాయి. 
 
వాహనాలను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే విడిచిపెడుతున్నారు. అమరావతి జేఏసీ పిలుపు మేరకు నిరసనలకు దిగిన టీడీపీ కార్యకర్తలను తాడేపల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు అమరావతి ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు పలుచోట్ల నిరసనలకు దిగిన టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. తాడేపల్లిలో పలువురు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు