ఏపీ ప్రభుత్వం ఇలా ఎందుకు వ్యవహరిస్తోంది : సుప్రీంకోర్టు ప్రశ్న

గురువారం, 24 జూన్ 2021 (13:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరో హెచ్చరిక చేసింది. రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే, తీవ్ర హెచ్చరికలు కూడా జారీచేసింది. 
 
పక్కా సమాచారం ఇవ్వాలని తాము ఆదేశించినప్పటికీ... అఫిడవిట్‌‍లో ఆ సమాచారం కనిపించలేదని అసహనం వ్యక్తం చేసింది. విద్యార్థులు, సిబ్బంది రక్షణ గురించి ప్రభుత్వం ఆలోచించాలని సూచించింది. పరీక్షల నిర్వహణ వల్ల ఏ ఒక్కరు చనిపోయినా కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
 
కరోనా సమయంలో ఒక్కో గదిలో 15 నుంచి 20 మందిని కూర్చో బెట్టడం ఎలా సాధ్యమవుతుందని సుప్రీం ప్రశ్నించింది. సెకండ్ వేవ్‌లో దారుణమైన పరిస్థితులను మనం చూశామని గుర్తుచేసింది. 
 
ప్రభుత్వం చెపుతున్నదాన్ని బట్టి పరీక్షలకు 28 వేల గదులు అవసరమవుతాయని... అన్ని వేల గదులను అందుబాటులోకి ఎలా తీసుకురాగలరని ప్రశ్నించింది. పరీక్షల తర్వాత జరిగే మూల్యాంకనం ప్రక్రియ కూడా చాలా పెద్దగా ఉంటుందని... వీటన్నిటికి సంబంధించి అఫిడవిట్‌లో ఎలాంటి వివరాలు లేవని అసహనం వ్యక్తం చేసింది.
 
కరోనాకు సంబంధించిన పలు రకాలైన వేరియంట్లు ఉన్నాయని, వీటివల్ల పెను ప్రమాదం పొంచివుందని నిపుణులు చెపుతున్నా... ఏపీ ప్రభుత్వం ఇలా ఎందుకు వ్యవహరిస్తోందని సుప్రీంకోర్టు మండిపడింది. ఒక నిర్ణయాత్మక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని సూచించింది. 
 
గ్రేడ్లను మార్కులుగా మార్చడం కష్టమే అయినప్పటికీ పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పింది. అవసరమైతే యూజీసీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డుల సలహాలను తీసుకోవాలని సూచించింది. పరీక్షలు కొనసాగుతున్న సమయంలో థర్డ్ వేవ్ వస్తే... రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని సూటిగా ప్రశ్నించింది. 
 
ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, కొంత సమయం ఇస్తే, ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తామని కోర్టును కోరారు. కానీ, కోర్టు ఆయన విన్నపాని తోసిపుచ్చింది. ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఇష్టానుసారం తీసుకునే నిర్ణయాలు విద్యార్థులపై ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానిస్తూ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు