తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కేంద్రీకరించింది. ఈ జిల్లాకు చెందిన పలువురు నేతలకు బీజేపీ నాయకత్వం గాలం వేస్తోంది. టీడీపీకి చెందిన నేతలకు బీజేపీ నేతలు వల వేస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని బీజేపీ తీర్థం పుచ్చుకొనే అవకాశం ఉంది.
2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌లో చేరాలని సీఎం కేసీఆర్ కోనేరు చిన్నిని ఆహ్వానించారు. కానీ, ఆయన టీడీపీలోనే కొనసాగారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కూడ కోనేరు చిన్నిని టీఆర్ఎస్‌లో చేర్పించేందుకు ప్రయత్నించారు. కానీ, కోనేరు చిన్ని మాత్రం టీడీపీలోనే ఉన్నారు.
కొత్తగూడెం నుండి ప్రజాకూటమి తరపున కాంగ్రెస్ అభ్యర్ధి వనమా వెంకటేశ్వరరావు గెలుపు కోసం కోనేరు చిన్ని మద్దతు ప్రకటించారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు టీడీపీలో ఉన్న సమయంలో కోనేరు చిన్ని నామా నాగేశ్వర్ రావు వర్గంగా ఉండేవాడు. 2014 ఎన్నికల సమయంలో కోనేరు చిన్నికి కొత్తగూడెం టీడీపీ టిక్కెట్టు ఇవ్వడంలో నామా నాగేశ్వర్ రావు కీలక పాత్ర పోషించారు.