విశ్వాసఘాతకులు - నలుగురు పోయారు.. 40000 వస్తారు : టీడీపీ నేత ఆలపాటి రాజా

శుక్రవారం, 21 జూన్ 2019 (16:35 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా స్పందించారు. టీడీపీని వీడినవారంతా నమ్మకద్రోహులు, విశ్వాస ఘాతుకలని ఆరోపించారు. నలగురు పోతే 40 వేల మంది వస్తారని వ్యాఖ్యానించారు. 
 
తెలుగుదేశం పార్టీకి చెందిన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌లతో పాటు గరికపాటి రామమోహన్ రావులు సొంతపార్టీ టీడీపీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. పైగా, రాజ్యసభ టీడీపీని బీజేపీలో విలీనం చేయాల్సిందిగా వారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ ఇవ్వగా, ఆయన కూడా దానికి సమ్మతం తెలిపారు. 
 
ఈ పరిణామాలపై ఆలపాటి రాజా మాట్లాడుతూ, ఈ నలుగురు నేతలు విశ్వాసఘాతకులని రాజా ఆగ్రహం వ్యక్తంచేశారు. వీరు బీజేపీలో చేరినా అక్కడి నేతలు మాత్రం ఈ నలుగురిని టీడీపీ కోవర్టులుగానే భావిస్తారని స్పష్టంచేశారు. 
 
టీడీపీని నలుగురు నేతలు విడిచిపెట్టిపోతే, 40 వేల మంది నాయకులు తయారు అవుతారని స్పష్టంచేశారు. కేవలం పార్టీని వీడటమే కాకుండా రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై కూడా ఆలపాటి రాజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 
పోలవరం ప్రాజెక్టును చూసేందుకు జగన్మోహన్ రెడ్డికి పదేళ్లు పట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. అక్కడ జరుగుతున్న పనులు చూశాక ఏపీ ముఖ్యమంత్రి నోరు పెగలడం లేదని దుయ్యబట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు