దీన్ని మనసులో పెట్టుకున్న భాజపా చంద్రబాబుకి దెబ్బకి దెబ్బ తీయాలన్న గట్టి నిర్ణయంతో వున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే తెదేపాకి చెందిన రాజ్యసభ సభ్యులను లాగేసింది. తాజాగా ఎమ్మెల్యేలను కూడా లాగేస్తే ఓ పనైపోతుందని భాజపా తగిన రీతిలో పావులు కదుపుతోంది. మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్యర్యంలో పని పూర్తి చేయాలని ప్లాన్లు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. శుక్రవారం సాయంత్రానికి గంటా నేరుగా భాజపా ఆఫీసుకి వెళ్లి పార్టీ తీర్థం పుచ్చుకుంటారని కూడా ప్రచారం జరుగుతోంది.
కాగా వైసీపి అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి తెదేపాకి చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో వున్నారనీ, ఐతే వారిని చేర్చుకోవాలంటే వారు తమ పదవులకి రాజీనామా చేసి రావాల్సిందేనని కండిషన్ పెట్టారు. దీనితో ఇక తెదేపా ఎమ్మెల్యేల్లో ఎవరైనా గోడ దూకాలంటే వైసీపితో పనికాదు. కాబట్టి కేంద్రంలో అధికారంలో వున్న భాజపా వారికి దిక్కు. అందువల్ల కొందరు ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పైగా వచ్చే ఐదేళ్లపాటు అధికారానికి దూరంగా వుండాలంటే చాలా కష్టం. అభివృద్ధి సంగతేమోగానీ కనీసం సొంత పనులు కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొంటుంది. అందువల్ల తెదేపాను వీడేందుకు కొందరు మొగ్గుచూపుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఐతే నలుగురైదుగురు ఎమ్మెల్యేలు వచ్చినా ప్రయోజనం వుండదనీ, 23 మంది ఎమ్మెల్యేల్లో కనీసం 15 మంది ఎమ్మెల్యేలను తమవైపు లాక్కోవాలని భాజపా ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. అదే జరిగితే చంద్రబాబు నాయుడుకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా గల్లంతవుతుంది. కేవలం సాధారణ ఎమ్మెల్యే మాదిరిగా కొనసాగాల్సి వుంటుంది.