పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి నారాలోకేశ్ నేతృత్వంలో జరిగిన అవకతవకలు ఇన్నీ అన్నీ కాదని స్పష్టమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా, సీనియర్ నేతగా ఉన్న సి.రామచంద్రయ్యకే టీడీపీ సభ్యత్వం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇంకా పలువురు జర్నలిస్టులూ, సామాన్యులకూ సభ్యత్వాలు జారీ చేశారు. ఓటర్ల జాబితా ఆధారంగా విచ్చలవిడిగా సభ్యత్వ నమోదు పత్రాలను పూరించటంతో ఇంత గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది.
ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే కడప నగరంలో సి. రామచంద్రయ్య వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ ఉషారాణి భర్త సూర్యనారాయణ రావు, ఆయన సోదరుడు అశ్వర్థ నారాయణకూ టీడీపీ సభ్యత్వాలు వచ్చాయి. పైగా పింఛనుదార్లనుంచి బలవంతంగా రూ.100 వసూలు చేసి సభ్యత్వం కట్టబెట్టిన వ్యవహారం పత్రికల్లో వచ్చింది. ఓటరు లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరికీ సభ్యత్వం జారీచేసి టీడీపీకి కోటిమంది సభ్యులున్నారంటూ గొప్పలు చెప్పుకున్నారు.
ఆ డొల్ల సభ్యత్వాలు చేర్పించడాన్నే అర్హతగా చూపి సీఎం తనయుడు నారా లోకేశ్‌కు ఎమ్మెల్సీ, మంత్రి పదవులు అప్పగించడం టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహంలో భాగమేనని పరిశీలకులు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియా ఈ ఉదంతంపై ఎకసెక్కా లాడుతోంది సి.రామచంద్రయ్యకు టీడీపీ సభ్యత్వం ఇచ్చినోళ్లు వైకాపా అధినేత జగన్‌కు ఎందుకివ్వలేదు. ఆయనేం పాపం చేశారు. ఒక సభ్యత్వం ఇచ్చేస్తే పోలా.. అంటూ జోకులుమీద జోకులేస్తున్నారు.