ఇంతకీ ఆ పవర్ ఎవరిది?

శనివారం, 18 జనవరి 2020 (08:53 IST)
రాజధాని నిర్మాణంకోసం భూములిచ్చిన రైతుల అభిప్రాయాలకు తరలింపు ప్రక్రియలో నామమాత్రపు విలువ కూడా లేదా? ఈ ప్రశ్న చుట్టే శుక్రవారం అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైకోర్టులోనూ, సిఆర్‌డిఎలోనూ ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది.

ఈ మేరకు దాఖలైన పిటిషన్ల నేపధ్యంలో 20వ తేది మధ్యాహ్నాం వరకు రైతుల అభిప్రాయాలను స్వీకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేరోజు అసెంబ్లీ సమావేశం జరగనున్న నేపథ్యంలో హై పవర్‌ కమిటీ సమావేశమైంది.
మంత్రిమండలి సమావేశానికి సమర్పించాల్సిఉన్న తుది నివేదికపై కసరత్తు చేసింది.

అనంతరం హైపవర్‌ కమిటీ సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్ససత్యనారాయణ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డితో భేటీ అయ్యారు. మరోవైపు మంత్రిమండలి సమావేశం విషయంలో గందరగోళం నెలకొంది. కొద్దిరోజుల క్రితం 20వ తేదే కేబినెట్‌ మీటింగ్‌ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఈ సమావేశాన్ని శనివారం(18)వ తేదికి మార్చింది. ఈ మేరకు మంత్రులకు సమాచారం పంపింది.

అధికారయంత్రాంగం కూడా సన్నాహాలను పూర్తి చేసింది. దీంతో రైతుల అభిప్రాయాలతో నిమిత్తం లేకుడానే మంత్రిమండలిలో నిర్ణయం తీసుకుంటారన్న వార్తలు వచ్చాయి. హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో కేబినెట్‌ సమావేశాన్ని 20వ తేదీనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజు ఉదయం 9.30 గంటలకు కేబినెట్‌ సమావేశం ఉంటుందని ఈ ఆదేశాల్లో పేర్కొంది.

రైతుల అభిప్రాయ స్వీకరణకు ఆ రోజు మధ్యాహ్నం వరకు సమయం ఉండటంతో 20వ తేది జరిగే కేబినెట్‌, అసెంబ్లీ సమావేశాల్లో రైతుల అభిప్రాయాలు చర్చకు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
రశీదులు ఇవ్వలేం : సిఆర్‌డిఎ
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో రైతులు సిఆర్‌డిఎకు చేరకున్నారు. వివిధ గ్రామాల నుండి ప్రదర్శనలుగా రైతులు తరలివచ్చారు. అయితే, వీరికి రశీదులు ఇవ్వడానికి సిఆర్‌డిఎ అధికారులు నిరాకరించారు.

అభ్యంతరాలు ఇచ్చి వెళ్లాలని, రశీదులు ఒకటి, రెండు రోజుల్లో ఇస్తామని చెప్పారు. దీంతో రైతులకు, అధికారులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. వేలాది మంది రైతులకు కేవలం ఏడు కౌంటర్లు ఎలా ఏర్పాటు చేశారని రైతులు ప్రశ్నించారు.

భూ సమీకరణ తరువాత ఏ సమాచారమైనా తమ మొబైల్‌కు పంపేవారని, ఇప్పుడు పత్రికల్లో సమాచారం ఇచ్చి కార్యాలయం వద్దనోటీసు బోర్డులో అంటిస్తే సరిపోతుందా? అని నిలదీశారు. నాలుగు రోజుల్లో అభిప్రాయాలు చెప్పాలన్నారని, కానీ మూడు రోజులు పండగ సెలవులకే పోయాయని , చివరి రోజు వస్తే రశీదులు ఇచ్చేది లేదనడం ఎలా సబబని అడిగారు.
 
హైకోర్టులో అత్యవసర విచారణ
ఈ ప్రశ్నలతోనే రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అభిప్రాయాలు తెలియచేసేం దుకు గడువును పెంచుతూ ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ రిట్‌ పిటిషన్లను శుక్రవారం హైకోర్టు అత్యవసరంగా విచారించింది. గడువును ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల వరకూ పెంపుదల చేయాలని నాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులిచ్చింది.

పిటిషనర్ల తరఫు సుప్రీంకోర్టు సీనియర్‌ లాయర్‌ సతీష్‌ పరాశరన్‌, సీనియర్‌ లాయర్‌ కనకమేడల రవీంద్రకుమార్‌ వాదించారు. . సీఆర్‌డీఏ సర్వర్‌ శుక్రవారం పనిచేయడం లేదన్నారు. అభ్యంతరాల స్వీకరిస్తున్నట్లుగా నోటిఫికేషన్‌ కూడా వెలువడలేదని, ఏ అంశాలపై రైతుల అభిప్రాయాలు తెలియ జేయాలో కూడా తెలియదని, పత్రికల్లోనే వచ్చిన వార్తలను చూసి రైతులు స్పందిస్తున్నా రని చెప్పారు.

అందుకే రైతులకు తగిన సమయం ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. సిఆర్‌డిఎ చట్టం 131 ప్రకారం ఏదైనా అభిప్రాయం తీసుకోవాలంటే విస్తృత ప్రచారం కల్పించాల్సి ఉంటుంది. దేనిపై అభిప్రాయం చెప్పాలో స్పష్టంగా పేర్కొనాలని, అటువంటిదేమీ లేదని, పైగా రైతుల అభిప్రా యాలు తీసుకోవాలని ప్రభుత్వంగానీ, సిఆర్‌డి ఏగానీ ఎక్కడా నోటీసు ఇవ్వలేదని వాదించారు.
 
కంటితుడుపు చర్యేనా...
ఈ నేపథ్యంలో రైతుల అభిప్రాయాలు కోరడం కేవలం కంటి తుడుపు చర్యే అన్న అభిప్రాయాన్ని న్యాయనిపుణులు వ్యక్తం చేస్తున్నారు. సిఆర్‌డిఏలోని 131 చట్టం ప్రకారం ఫలానా అంశంపై అభిప్రాయం చెప్పాలని కోరితే దానికి విలువ ఉంటుందని, అటువంటి ప్రకటనేదీ రాలేదని, అటువంట ప్పుడు రైతుల అభిప్రాయాలకు విలువ, న్యాయబద్ధత ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
 
అసెంబ్లీలో చర్చించేనా ?
బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు, జిఎన్‌రావు నివేదికలతో పాటు హై పవర్‌ కమిటీ చేసే సిఫార్సుల ఆధారంగా రాజధాని తరలింపునకు సంబంధించిన రూపొందించే బిల్లుపై 20వ తేదీన జరిగే అసెంబ్లీ సమావేశంలో చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది.

20వ తేదీ వరకూ రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో వాటిని క్రోడీకరించి అదేరోజు అందచేయడం దాదాపు అసాధ్యమే! దీంతో రైతుల అభిప్రాయాలు దాదాపు చర్చకు రాని పరిస్థితి నెలకొంది. . ఒకవేళ రైతుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలంటే గనుక అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.

మరోవైపు శాసనసభ, శాసనమండలి వ్యవహారాల కమిటీ సమావేశాలను 20వ తేది కలిపి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉభయసభల సంయుక్త సమావేశం జరిపే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తున్నా దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజల మనోభావాల మేరకే ముందుకు : మంత్రులు
రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ప్రజల మనోభావాల మేరకు ముందుకు వెళ్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం మంత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి రైతుల అంశంపైనా సిఎంతో చర్చించామని, వారికి మరింత లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించాలని సిఎం సూచనలు చేశారని తెలిపారు. కమిటీ నివేదికలో అంశాలనూ సిఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. అమరావతి రైతులు చంద్రబాబు మాయలో పడొద్దన్నారు.
 
అత్యధికం తరలింపునకు వ్యతిరేకం
రాజధాని మార్పులపై సిఆర్‌డిఏకు రైతుల నుంచి వినతులు వెల్లువెత్తాయి. 29 గ్రామాలకు చెందిన రైతులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా వినతులతో కూడిన అభ్యంతరాలు పంపినట్టు అధికార వర్గాలు తెలిపాయి. శుక్రవారం సాయంత్రం వరకూ 23వేల వినతులు రాగా ఇందులో 20 వేల వినతులు మెయిల్స్‌, ఆన్‌లైన్‌ రూపంలో రాగా మూడు వేలు నేరుగా అందాయి.

మ్తొతం 23 వేల వినతుల్లో 21,400 మంది రాజధాని మార్పునకు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం, అమరావతిలోనే హైకోర్టు, సచివాలయం అసెంబ్లీ కొనసాగించాలని ఇక్కడ నుంచి పరిపాలన కొనసాగించాలని ఎలాంటిమార్పులు చేయరాదని కోరారు.

మిగతా వారు కూడా రాజధాని మార్పులను వ్యతిరేకిస్తూనే ఇతర సమస్యలను కూడా ప్రస్తావించారు. అసైన్టు భూములకు కూడా సాదారణ భూములతో సమానంగా ఇవ్వాలని, మార్పులు చేస్తే రైతులకు మెరుగైన పద్ధతిలో ప్లాట్స్‌లు ఇవ్వాలని మరికొందరుకోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు