ఇంట్లో మగ్గముంటే చాలు యేడాదికి రూ.24 వేలు సాయం : జగన్
ఆదివారం, 22 డిశెంబరు 2019 (15:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన పుట్టిన రోజును పురస్కరించుకుని మరో వరాన్ని ప్రకటించారు. నేతన్నలను ఆదుకునేందుకు వీలుగా ఈ వరం ఉంది. ప్రతి చేనేత కుటుంబానికి రూ.24 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్టు ప్రకటించారు.
అనంతపురం ధర్మవరంలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ధర్మవరం పట్టు వస్త్రాలు దేశానికే ఆదర్శమన్నారు. చేనేత కష్టాలు తెలుసు కాబట్టే వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.
నేతన్న నేస్తం డబ్బులను పాత అప్పుల కింద జమ చేయవద్దని బ్యాంకర్లను ఆదేశించారు. బీసీలంటే వెనుకబడిన కులాలు కాదని.. సమాజానికే బ్యాక్ బోన్ అని అభివర్ణించారు. జనవరి 9 నుంచి అమ్మ ఒడి పథకం అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.
ఉగాది రోజున 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందిన 81 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు.