ఈ సంవత్సరపు మృత్యుంజయులు

సోమవారం, 24 డిశెంబరు 2007 (11:48 IST)
FileFILE
మృత్యుంజయులుగా పురాణాలలో పేరొందిన ధృవుడు, మార్కేండయుల ఇతివృత్తాలు మనకు తెలిసిందే. అయితే మనలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ మృత్యువును జయించిన కొందరిని 2007 సంవత్సరం మనకు పరిచయం చేసింది. అంతేకాక వైద్యానికి లొంగని వైకల్యం మానవునిలో లేదనే సత్యాన్ని ఈ సంవత్సరం యావత్ ప్రపంచానికి చాటి చెప్పింది.

అంతటి చరిత్రను సృష్టించిన ఆ ఘటనలలో తొలి సంఘటనగా చిన్నారి లక్ష్మికి విజయవంతంగా జరిగిన శస్త్రచికిత్సకు ప్రథమ తాంబూలం దక్కుతుంది. బీహార్ రాష్ట్రంలోని అర్‌రియా జిల్లాకు చెందిన రెండు సంవత్సరాల లక్ష్మి పుట్టుకతోనే అంగవైకల్యాన్ని సంతరించుకుంది. చిన్నారి లక్ష్మి దేహానికి దిగువ భాగాన మరొక దేహం ఏర్పడటం ఆమె తల్లిదండ్రులలో తీవ్రమైన నిరాశను చేకూర్చింది.

అయితే వారిలో కొత్త ఆశలను నింపుతూ బెంగుళూరుకు చెందిన స్పర్శ్ ఆసుపత్రికి చెందిన శరణ్ పాటిల్ అనే వైద్యులు ముందుకు వచ్చారు. వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ పాటిల్ చేసిన శస్త్ర చికిత్సతో లక్ష్మి పూర్తిగా కోలుకుంది. అంతేకాక ఎటువంటి ఆధారం లేకుండా చలాకీగా తిరుగుతున్న చిన్నారి లక్ష్మి, తల్లిదండ్రుల కన్నుల్లో ఆనంద జ్యోతులను వెలిగిస్తోంది.

ఇక తర్వాత వ్యక్తిగా మనం చెప్పుకోవలసింది 18 సంవత్సరాల వయస్సు గల మనీష్ పురోహిత్ గురించి. ఎందుకంటే అతని ఘటనను తెలుసుకున్న తర్వాత ఈ ప్రపంచంలో మనీష్‌ను మించిన అదృష్టవంతులు మరొకరు ఉండరని మీరు సైతం అంగీకరిస్తారు.

మన రాష్ట్రానికి చెందిన మనీష్ ప్రయాణిస్తున్న బస్సు, ఒక లారీ ఢీకొనడంతో లోహపు కడ్డీ మనీష్ శిరస్సులోకి దూసుకు పోయింది. అయినప్పటికీ ఎటువంటి భయాందోళనలకు గురికాని మనీష్ అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించాడు.

అనంతరం మనీష్‌ను వైద్య చికిత్స నిమిత్తం బెంగుళూరుకు తరలించారు. అక్కడి వైద్యులు మనీష్ శిరస్సులోని లోహపు కడ్డీని తొలగించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించారు. లక్ష్మికి శస్త్ర చికిత్స చేసిన శరణ్ పాటిల్, మనీష్‌కు కూడా పునర్జన్మను అందించడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి