ఓనమాలకు ఊతమిచ్చిన 2007

సోమవారం, 24 డిశెంబరు 2007 (12:35 IST)
విద్యారంగానికి 2007 సంవత్సరం సర్వశ్రేష్టమైందిగా అవతరించింది. మెయిలీ కమిటీ సిఫార్సుల మేరకు ఓబీసీలకు రిజర్వేషన్ల కేటాయింపును సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు తన తీర్పు ద్వారా అడ్డు చెప్పడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇదిలా ఉండగా పిల్లలను పాఠశాలకు రప్పించే క్రమంలో ప్రధాన మంత్రి యోజనలో భాగంగా మధ్యాహ్న భోజన పథకానికి అత్యధిక ప్రాధాన్యత, కళాశాలలో ర్యాగింగ్‌ను నిలువరించేందుకు రాఘవన్ కమిటీ సిఫార్సుల అమలుకు ఆమోదం తదితర అంశాలు భారతీయ విద్యారంగ అభివృద్ధికి శుభ సంకేతాలుగా నిలిచాయి.

అదేసమయంలో ఉన్నత విద్యకు జవజీవాలు అందించే క్రమంలో ప్రధాన మంత్రి కార్యాలయం, మానవ వనరులశాఖ మంత్రి అర్జున్ సింగ్ మరియు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటిక్ సింగ్ అహ్లువాలియాల మధ్య జరిగిన సమావేశం సత్ఫలితాలను అందించింది. ప్రస్తుత విద్యా వార్షిక బడ్జెట్‌ 34 శాతం వృద్ధిని చవిచూసి రూ. 32,352 కోట్ల కేటాయింపులను దక్కించుకుంది.

సర్వ శిక్షా అభియాన్‌ పథకానికి అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఉమ్మడిగా భరించాలనే కీలకమైన నిర్ణయాన్ని కేంద్ర మంత్రివర్గం 2007 సంవత్సరంలోనే తీసుకుంది. దేశంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు రూ. 17270.22 కోట్లను కేటాయించలన్న వీరప్ప మొయిలీ కమిటీ ప్రతిపాదనకు సుప్రీం కోర్టు తీర్పు అడ్డు చెప్పడంతో సంబంధిత ప్రతిపాదన అటకెక్కింది.

స్వాతంత్రదినోత్సవం సందర్భంగా భారత ప్రధాని మన్మోహన్ సింగ్ విద్యారంగంపై వరాల జల్లు కురిపించారు. దేశ వ్యాప్తంగా 6,000 ఉన్నత విద్యా పాఠశాలలు, 370 జిల్లాలలో కళాశాలలు, 1600 ఐటీఐ మరియు పాలిటెక్నిక్ కళాశాలలు, కొత్తగా 10,000 వృత్తి విద్యా పాఠశాలలు, 5,000 బాల వికాస కేంద్రాలు, కొత్తగా 30 విశ్వవిద్యాలయాలు, కొత్తగా ఎనిమిది ఐఐటీలు, ఏడు ఐఐఎమ్‌లతో పాటుగా 20 ఐఐఐటీలు, కొత్తగా ఐదు విజ్ఞాన శిక్షా కేంద్రాలను పదకొండవ పంచ వర్ష ప్రణాళికలో పూర్తి చేస్తామని ప్రధాని ప్రకటించడం, అంతర్జాతీయ సమాజంలో తృతీయ శక్తిగా ఎదుగుతున్న భారతదేశానికి ఆశాజనకమైన పరిణామం.

వెబ్దునియా పై చదవండి