క్రికెట్ ప్రపంచ ఆణిముత్యం.. మురళీధరన్

సోమవారం, 24 డిశెంబరు 2007 (12:56 IST)
FileFILE
నల్లని రంగు. కాస్త పొట్టి ఆకారం. మెరిసే కళ్లు. ఓర చూపులు. ముఖంపై ఎప్పుడూ చెరగని చిరుదరహాసం. ఇవన్నీ పుణికి పుచ్చుకున్న క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్. శ్రీలంక క్రికెట్‌కే కాదు.. క్రికెట్ ప్రపంచానికే ఓ ఆణిముత్యం. తన చేతి నుంచి జాలువారే బంతులు బొంగరంలా గింగుర్లు తిరుగుతూ.. ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తాయి. క్రీజ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ బంతి గమనాన్ని గమనించే లోపే.. ఆ బంతి వికెట్లను గిరాటేస్తుంది.

ఇలా.. 709 మంది బ్యాట్స్‌మెన్స్‌ను అవుట్ చేసిన ఏకైక బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అదీ కూడా అతి పిన్న వయస్సులో తక్కువ టెస్టుల్లోనే. ఇలాంటి ఘనత సాధించిన తొలి ఆఫ్ స్పిన్నర్ ఇతనే కావడం మరో విశేషం. ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో డిసెంబరు మూడో తేదీన ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ పాల్ కాలింగ్‌వుడ్ వికెట్ నేలకూల్చి.. ఆ ఆనందం పారవశ్యంలో మైదానమంతా గంతులు వేశాడు.

ఇదిలావుండగా.. ఇప్పటి వరకు టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు అసీస్ లెగ్‌స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ (708) పేరిట ఉండేది. ఈ రికార్డును తాను పుట్టి పెరిగిన గడ్డపైనే (శ్రీలంకలోని కాండీ మైదానం), కుటుంబ సభ్యులు, హితులు, స్నేహితుల మధ్య తిరగరాశాడు ఈ చెన్నై అల్లుడు. 1992లో శ్రీలంకలో పర్యటించిన ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

అప్పటి నుంచి 116 టెస్ట్ మ్యాచ్‌లలో మురళీధరన్ మొత్తం 710 వికెట్లు తీయగా... షేన్ వార్న్ 145 టెస్ట్‌ల్లో 708 వికెట్లు తీశాడు. అయితే షేన్ వార్న్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగగా మురళీధరన్ మాత్రం ఇంకా కొనసాగుతూ ఎవరికీ అందనంత ఎత్తులో తన రికార్డును తీసుకెళ్లి ఉంచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాడు.

పుట్టింది, పెరిగిందీ శ్రీలంక గడ్డపై అయినా.. తాను ఎక్కువగా అభిమానించేది మాత్రం భరతభాతనే. అందుకే.. తన జీవిత భాగస్వామిగా చెన్నైకు చెందిన పారిశ్రామికవేత్త కుమార్తె మధిమలర్‌ను వివాహమాడాడు ఈ శ్రీలంక క్రికెటర్.

వెబ్దునియా పై చదవండి