జయాపజయాలతో టాలీవుడ్

సోమవారం, 24 డిశెంబరు 2007 (18:58 IST)
FileFILE
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దర్శకుల హవా కాస్త తగ్గిందనే చెప్పాలి. అగ్రహీరోలు సినిమాల్లో ముగ్గురుకి మినహా ఎవరికీ సరైన సక్సెస్‌లు లేవు. గత ఏడాది 'పోకిరి' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మహేష్ బాబుకు 'అతిథి'నిరాశ మిగిల్చింది. 'దేశముదురు'తో ఈ ఏడాది సినిమా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. అగ్రహీరోలుగా పిలవబడే మెగాస్టార్ చిరంజీవి 'శంకర్‌దాదా జిందాబాద్' బాగా మైనస్ అయ్యింది. వరుసగా రెండేళ్ల నుంచి సక్సెస్ లేని నందమూరి బాలకృష్ణకు ఈ ఏడాది కూడా 'మహారథి' పెద్ద ప్లాప్ ఇచ్చింది. 'చంద్రముఖి' వంటి హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు పి.వాసు చేసిన భగీరథ ప్రయత్నం కూడా గంగపాలైంది.

ఇక రాఘవ లారెన్స్ 'మాస్‌'తో నాగార్జునకు హిట్ ఇచ్చి ఈ ఏడాది చివర్లో 'డాన్‌'గా చూపబోయి ఢాం అనిపించాడు. వెంకటేష్‌కు 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే', 'తులసి' వంటి రెండు హిట్లను తన ఖాతాలో జమచేసుకున్నాడు. సంక్రాంతికి తల్లి సెంటిమెంట్‌తో ముఖ్యమంత్రి వైఎస్ బావమరుదులు ప్రభాస్‌ను హీరోగా పెట్టి తీసిన 'యోగి' చిత్రం అడ్రస్ లేకుండా పోయింది. రెండేళ్లుగా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' చిత్రాలతో హిట్లు కొట్టిన సిద్దార్థతో ఎంఎస్ రాజు 'ఆట' అంతంత మాత్రంగానే ఆడింది.

ఇక యువ అగ్రహీరోలు ఎన్టీఆర్ నిజంగా 'యమదొంగ'తో సక్సెస్ సాధించాడు. కానీ అందులో తన అదనపు కండల్ని కరిగించుకుని కొత్తగా కన్పించేందుకు నానా తంటాలు పడ్డాడు. 'ఆనంద్', 'గోదావరి' చిత్రాల తర్వాత అంతా కొత్తవారితో శేఖర్ కమ్ముల పాత ఫార్ములానే ఉపయోగించి తీసిన 'హ్యాపీడేస్' చిత్రం కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీకే హ్యాపీరోజులు వచ్చాయని నిరూపించాడు.

ఆ దెబ్బతో అగ్రహీరోలు సైతం తాము చేయడానికి సిద్ధమంటూ శేఖర్ కమ్ములకు వర్తమానాలు పంపారు. అనుకోకుండా ఒక రోజు ఓ మోస్తరుగా ఆడినా ఆ తర్వాత సరైన కమర్షియల్ చిత్రాల సక్సెస్‌ల కోసం కష్టాలు పడుతున్న ఛార్మీకి తాను వేసిన మంత్రం ఫలించింది. సాఫ్ట్‌వేర్ రంగంలో నుంచి సినిమాసరంగంలోకి వచ్చిన కుర్రాళ్లు మంత్ర సినిమాను సరదాగా తీసి చక్కని సక్సెస్ సాధించారు.

ఇక ఈ ఏడాది 88 స్ట్రెయిట్ చిత్రాలు విడుదలైతే వాటికి అటూఇటూగా సమాన స్థాయిలో డబ్బింగ్ చిత్రాలు విడుదలయ్యాయి. ఇంక ఈ ఏడాదిలో నాలుగా సినిమాలు డబ్బింగ్ చిత్రాలు విడుదల కాగా.. వాటిల్లో రజనీకాంత్ శివాజీ మినహా ఏ చిత్రానికి సరైన గుర్తింపు లేకుండా పోయింది. ఈ సారి డబ్బింగ్ హీరో విశాల్ భరణి, భయ్యా చిత్రాలతో ముందుకు వచ్చినా ప్రేక్షకులు బైబై చెప్పారు. అందుకే లాభం లేదనుకుని స్ట్రెయిట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు సెల్యూట్ అంటూ త్వరలో రానున్నాడు. అది వచ్చే ఏడాదికి పూర్తవుతుంది. గతంలో సూర్య గజినికి వచ్చిన పేరు ఈ ఏడాది దేవా చిత్రానికి రాలేదు.

FileFILE
ఈ ఏడాది సాంకేతికపరంగా దర్శకనిర్మాతలు భారీ స్థాయిలో వెచ్చించడం జరిగింది. యమదొంగకు కథమీద కంటే టెక్నికల్ జిమ్మిక్కులు బాగా కనిపించాయి. అదే కోవలో అతిథి కనిపిస్తుంది. గత ఏడాది సైనికుడులో ఉపయోగించిన డిజిటల్ ఇంటర్మీడియట్ టెక్నాలజీ అతిథికి ఉపయోగించి అదనపు ఖర్చు మినహా సినిమాకు ఉపయోగపడింది ఏమీ లేదు. దీంతో కథలో ఫీల్ తెప్పించాలే గాని టెక్నికల్‌తో టెక్కు పోకూడదని అర్థం చేసుకున్నారు.

సీనియర్ దర్శకులు దాసరి నారాయణ లాంటి వాళ్లు కూడా ఫెయిల్యూర్స్‌ను చివిచూశారు. డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగి ఆయన సరైన హిట్ సినిమా చేయలేకపోయాడు. మరోవైపు నిర్మాణ వ్యయం పెరిగిపోతుందనే గగ్గోలు పెడుతున్న నిర్మాతలు కూడా తమ దాకా వచ్చేసరికి చేతులు కట్టుకుని కూర్చోవలసి వచ్చింది. ఒక వస్తువును తయారు చేసి దాన్ని మార్కెట్ రేటు 10 రూపాయలుగా నిర్ణయించే ఉత్పత్తిదారుడు, వ్యాపారస్థుడు ఏదైనా అనండి.. సినిమా విషయంలో మటుకు చేతులెత్తేస్తున్నారు. ఫలానా సినిమా చేయాలంటే ఇంత బడ్జెట్ అంటే నియంత్రించలేక పోతున్నారు.

మార్కెట్‌లో ఒక్కో వస్తువుకు ఒక్కో మార్కెట్ ఉంటుంది. అలాగే సినిమా రంగంలో ఒక్కో హీరోకు ఒక్కో మార్కెట్ ఉంటుంది. కానీ నిర్మాతలు పరిమితి దాటిపోయి హీరోలకు ఎక్కువ పారితోషికాలు ఇచ్చేస్తున్నారు. తాజా ఉదాహరణే తరుణ్‌తో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రంలో ఇలియానాకు కోటి రూపాయలు ఇచ్చి పెట్టుకోవడం గమనార్హం. కాంబినేషన్‌లు చూసుకోవడం మినహా ఇది వర్కఅవుట్ అవుతుందా లేదా అన్నది... అనేది అస్సలు పట్టించుకోని జాడ్యం సినిమా రంగంలో ఎక్కువగా ఉంది. ఇక రీమేక్ రైట్స్ కోసమే అధికంగా వెచ్చించి శంకర్‌దాదా జిందాబాద్ చిత్రాన్ని తీసిన జెమినీ టీవీ యాజమాన్యం చేతికి జిగురు అంటించుకున్నారు.

అందుకే మరో నిర్మాత సీసీ రెడ్డి నేడు సినిమా రంగంలో క్రమ శిక్షణ తగ్గిపోతోందని వాపోతున్నారు. కార్పొరేట్ రంగం, సినిమారంగంలోకి రావడం మంచిదేనని అన్నారు. దాని వల్ల క్రమశిక్షణ, మొనోపొలి తగ్గుతుందని ఆయన భావం. ప్రతి దానికి జవాబుదారీ తనం ఉంటుందని సినిమా ఆగిపోవడం అనేవి ఉండదని, బడ్జెట్ నియంత్రణ ఉంటుందనే కఠోర సత్యాలు చెబుతున్నారు.

లక్కీ హీరోలు...
తెలుగు ఇండస్ట్రీలో నిన్నా మొన్నటి వరకు శ్రీకాంత్‌కు లక్కీ హీరోగా పేరుండేది. సినిమా సక్సెస్‌తో నిమిత్తం లేకుండా వరుసనే సినిమాలు వచ్చేవి. ఈ ఏడాది ఆపరేషన్ దుర్యోధనతో మంచి సక్సెస్ సాధించిన శ్రీకాంత్ ఆచి తూచి అడుగులేస్తున్నాడు. ఈ ఏడాది లక్కీ హీరోలుగా శివాజీ, అల్లరి నరేష్‌లను అదృష్టం వరించింది. నీనవ్వే చాలు, నిక్కీ అండ్ నీరజ్, స్టేట్‌రౌడీ, సత్యభామ వంటి చిత్రాలతో పాటు మరి నాలుగు చిత్రాలు రెడీ ఉన్న శివాజీకి ఈ మధ్య తాజాగా విడుదలైనవి ఏవీ మంచి పేరు తెచ్చిపెట్టలేకపోయాయి.

FileFILE
కాని సినిమాలు తర్వాత సినిమాలు ఆయనకు వస్తూనే ఉన్నాయి. అదే కోవలో అల్లరి నరేష్ వచ్చాడు. ఈ ఏడాది ఒక్క మాసంలో ఆయని ఏడు సినిమాలు రావాల్సి ఉండగా.. ఎప్పుడు రిలీజ్ చెయ్యాలో తెలీని పరిస్థితి వచ్చింది. పెళ్లయింది కానీ సినిమా వరకు సరైన సక్సెస్ లేకపోయినా సీమశాస్త్రి కాస్త ఊరటనిచ్చింది. ఇంకా పెళ్లికాని ప్రసాద్, వైజ్ ఎక్స్‌ప్రెస్, సుందరకాండతో పాటు మరో నాలుగు చిత్రాలు అల్లరి నరేష్‌కు రెడీగా ఉన్నాయి.

లక్కీ హీరోలుగా... తులసీలో శివాజీ.. మంత్రలో శివాజీ...
మరో వైపు సోలో హీరోలుగా పగలే వెన్నెల, పొగరుబోతు తదితర చిత్రాల్లో శివబాలాజీ, నవదీప్‌లు పెద్దగా సక్సెస్‌లు సాధించలేకపోయారు. కానీ ఇద్దరూ కలిసి నటించిన చందమామ చిత్రం వంద రోజులు ఆడింది. అదే కోవలో లక్ష్యం గోపీచంద్, జగపతి బాబు చిత్రం బాగానే ఆడింది. ఒక్కరకంగా చెప్పాలంటే మల్టీస్టారర్ చిత్రాలు ఎక్కువగా వచ్చాయనే చెప్పాలి. డాన్‌లో లారెన్స్, నాగార్జున ఉన్నట్లే మోహన్‌బాబు నిర్మిస్తోన్న కృష్ణార్జునలో విష్ణుతో పాటు నాగార్జున, మోహన్‌బాబు నటిస్తున్నారు. అదేవిధంగా కేఎస్ రామారావు తాజాగా ప్రభాస్‌తో నిర్మిస్తున్న చిత్రంలో మోహన్‌బాబు కూడా కనిపించడం విశేషం.

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ చిరుతతో ముందుకు వచ్చి కుర్రాడు బాగానే చేశాడనిపించుకున్నాడు. అలాగే 90 చిత్రాలకు దర్శకుడిగా ఉన్న ఎ కోదండరామిరెడ్డి వారసుడు వైభవ్ కూడా ఓపెనింగ్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. ఎంఎస్ రాజు వారసుడు సుమంత్ అశ్విన్, పరుచూరి వెంకటేశ్వరరావు తనయుడు రవి హీరోలుగా తెరంగేట్రం చేశారు.

ఈ ఏడాది థియేటర్‌లు మోనోపొలి కొట్టవచ్చినట్లు కనపడింది. కొంతమంది చేతుల్లోనే థియేటర్‌లు చిక్కుకున్నాయి. చిన్న సినిమాలుకు థియేటర్‌లే కరువయ్యాయి. ఈ దృష్టిలో పెట్టుకని మల్టీప్లెక్స్ థియేటర్‌ల నిర్మాణం ఎక్కువయ్యింది. త్వరలో హైదరాబాద్‌లో 4 మల్టీప్లెక్స్ థియేటర్‌లు, విజయవాడ, వైజాగ్‌లలోను మల్టీప్లెక్స్‌లు నిర్మించే ఆలోచనలో పెద్ద నిర్మాతలున్నారు. మరో వైపు హ్యాపీడేస్ వంటి చిన్న చిత్రాలు విజయవంతం కావడంతో అదే కోవలో ఇబ్బడిముబ్బడిగా కొత్త నిర్మాతలు దర్శకులు ఆ తరహా చిత్రాల వైపు దృష్టి సారించారు.

కొత్త బంగారు లోకం చిత్రం నిర్మాత గిరి నిర్మించే చిత్రం, దర్శకుడు కణ్మణి రూపొందించే కాల్‌సెంటర్ తదితర చిత్రాలు ఈ కోవలోలే వస్తాయి. ఇవి కాక అసలు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేవారు కూడా హ్యాపీడేస్‌ను బేస్ చేసుకుని చిత్రాలు నిర్మించడానికి ముందుకు వచ్చారు. మరి ఎంతవరకు వారు చెప్పింది సమంజసం అనేది ప్రేక్షకులే త్వరలో నిర్ణయించాల్సి ఉంది.