ధరిత్రి ప్రేమికునికి అత్యున్నత పురస్కారం

సోమవారం, 24 డిశెంబరు 2007 (20:09 IST)
FileFILE
"వసుధైక కుటుంబం అన్న భావనతోనే యావత్ ప్రపంచం సుఖ శాంతులతో మనగలుగుతుందనే సూత్రాన్ని అంతర్జాతీయ సమాజానికి చాటి చెప్పిన భారత దేశం కన్న బిడ్డను నేను. ప్రాచీన కాలంలోనే ప్రపంచానికి నాగరికతను నేర్పిన భారతదేశపు వసుధైక కుటుంబ తత్వం పర్యావరణ పరిరక్షణతోనే మనగలుగుతుందని త్రికణ శుద్ధిగా విశ్వసిస్తున్న వారిలో నేను ఒకడినే అని నాకు అత్యున్నతమైన నోబెల్ శాంతి పురస్కారంలో భాగస్వామ్యాన్ని కల్పించిన ఈ గొప్పదైన సభకు వినమ్రంగా విన్నవించుకుంటున్నాను"...

2007 డిసెంబర్ 10వతేదీన నార్వే దేశంలోని ఓస్లోలో అమెరికా దేశపు మాజీ ఉపాధ్యక్షుడు అల్ గొరేతో కలిసి నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా డాక్టర్ రాజేంద్ర కే పచౌరీ ప్రసంగంలో చోటు చేసుకున్న పంక్తులివి. పరిశుభ్రమైన నీటి లభ్యత, అవసరమైన మేరకు ఆహారం, నిలకడగా ఉండే ఆరోగ్య పరిస్థితులు, ప్రకృతి సిద్ధమైన వనరులు, నివాస భద్రత ఉన్నప్పుడే పర్యావరణ సమతుల్యత పరిరక్షించబడుతుందని పచౌరీ పేర్కొన్నారు.

నీటి సరఫరా వ్యవస్థ కల్పన, ప్రజారోగ్య సేవలు పెట్టుబడుల పెంపుదల, నీటివనరుల నిర్వహణ, సముద్ర తీర ప్రాంతంలో సురక్షిత ఏర్పాట్లు, పకృతి వైపరీత్యాల తీవ్రతను తగ్గించే పథకాలు. అంతర్జాతీయ సమాజం సమన్వయంతో వ్యవహరించి సరియైన చర్యలను చేపట్టడం ద్వారా ప్రపంచంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో తలెత్తె దుష్పరిణామాలను గురికావడంలో ముందుండే ప్రాంతాల వారిని, ఆయా ప్రాంతాల వ్యవస్థను కాపాడే దిశగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రతి యేటా పర్యావరణ పరిరక్షణ చర్యలను చేపట్టడంలో మనం చేసే ఆలస్యం భవిష్యత్తులో పర్యావరణంలో ప్రమాదకరమైన రీతిలో పెనుమార్పులు సంభవించేందుకు కారణమవుతుంది. ఇప్పటికే ప్రపంచంలో పేదరికంలో మగ్గిపోతున్న ప్రాంతాలు పర్యావరణ దుష్ప్రరిణామాల తాలూకు ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందనే దానికి తార్కాణంగా నిలుస్తున్నాయనేది దాచినా దాగని నిష్టూర సత్యమని పచౌరీ హెచ్చరించారు.

FileFILE
భారతదేశంలోని నైనిటాల్‌లో 1940 ఆగస్టు పదవతేదీన పచౌరీ జన్మించారు. వారణాసిలోని డీజిల్ లోకోమోటీవ్స్‌లో పలు కార్యనిర్వహణ బాధ్యతలను నిర్వహించిన పచౌరీ అనంతరం అమెరికాలోని నార్త్ కరొలీనా స్టేట్ యూనివర్శిటీలో చేరి 1972 సంవత్సరంలో ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్‌లో ఎమ్మెఎస్ పట్టాను పుచ్చుకున్నారు.

అలాగే అదే యూనివర్శిటీలో ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్‌‌లో డాక్టరేట్ మరియు ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. తదనంతర కాలంలో స్వదేశానికి విచ్చేసిన పచౌరీ ప్రభుత్వ అనుబంధిత సంస్థలలో కీలకమైన పదవులలో తనదైన శైలిలో ప్రతిభాపాటవాలను ప్రదర్శించి, ఆయా సంస్థల గతిని అభివృద్ధి దిశగా మళ్ళించారు.

ఆయన ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 2001 జనవరిలో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 1988 సంవత్సరంలో వరల్డ్ మెటరోలాజికల్ ఆర్గనైజేషన్ మరియు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ సంయుక్తంగా స్థాపించిన ఇంటర్‌ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) ఛైర్మన్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్న డాక్టర్ రాజేంద్ర కే పచౌరీ నోబెల్ శాంతి పురస్కారాన్ని పంచుకోవడం పర్యావరణ ప్రేమికులకు 2007 సంవత్సరం అందించిన మధురమైన జ్ఞాపకం.