బాలీవుడ్‌ 2007... హాస్య చిత్రాలదే హవా

శనివారం, 22 డిశెంబరు 2007 (14:09 IST)
బాలీవుడ్‌లో హాస్యచిత్రాలదే హవా అనడానికి 2007 సంవత్సరాన్ని నిదర్శనంగా తీసుకోవచ్చు. ఒకప్పుడు బాలీవుడ్ తెర ఇలవేల్పులైన ధర్మేంద్ర, వినోద్ ఖన్నా మరియు మాధురి దీక్షిత్‌లు ముఖానికి రంగు వేసుకుని రంగంలోకి దిగినప్పటికీ కామెడీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోతను వినిపించాయి. కామెడీ చిత్రాలు ధాటికి తెరవేల్పులు నటించిన చిత్రాలు తెరమరుగు కాక తప్పలేదు.

ఈ సంవత్సరపు బాలీవుడ్ చిత్రాలకు ప్రత్యేకతను ఆపాదించే రీతిలో క్రీడారంగానికి సంబంధించినవై దేశభక్తి మరియు మహిళా సాధికారతకు పెద్ద పీట వేసే రీతిలో (చెక్ దే ఇండియా) అలాగే పరాయిగడ్డ ఆత్మాభిమాన పరిరక్షణను చాటి చెప్పే విధంగా (గోల్) మరియు కుటంబ సంబంధాలను (అప్నే) మూడు చిత్రాలు విడుదల కావడం గమనార్హం.

బాలీవుడ్ వాణిజ్య విశ్లేషకుడు అమోద్ మెహ్రా చెప్పినదానిని అనుసరించి "2007 డిసెంబర్ మొదటి వారానికి 236 సినిమాలు విడుదలయ్యాయి. అటు ఇటుగా హిట్లు మరియు ఫ్లాప్ కాబడిన చిత్రాల శాతం ఒకే విధంగా ఉంది. హాస్యంతోపాటు వినోదాన్ని అందించే చిత్రాలకు ప్రేక్షకులు పట్టం కట్టారు.


'నమస్తే లండన్', 'పార్ట్‌నర్', 'హే బేబీ', 'భూల్‌భుల్లైయా', 'జబ్ వుయ్ మెట్' మరియు 'ఓం శాంతి ఓం' చిత్రాలు తర్కానికి అందకపోయినా ఫార్మూలా చిత్రాలను కాదని పైవాటిని సగటు బాలీవుడ్ ప్రేక్షకుడు అద్భుతంగా ఆదరించి భారీ హిట్ చిత్రాల కోవలో చేర్చాడు. రొటీన్‌కు భిన్నంగా వైవిధ్యాన్ని ఆపాదించుకున్న 'గురు', 'చెక్‌దే ఇండియా' మరియు 'భేజా ఫ్రై' చిత్రాలు కూడా చక్కగా ప్రదర్శితమయ్యాయని" అమోద్ పేర్కొన్నారు.

షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ చిత్రాలు అత్యధికంగా విజయవంతం కావడంతో 2007 సంవత్సరం వారిరువురికి స్వంతమైపోయిందని అమోద్ తెలిపారు. 'హానిమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్', 'తారా రమ్ పమ్', 'మెట్రో', 'షూట్‌అవుట్ ఎట్ లొఖండ్‌వాలా', 'చీని కుమ్', 'ధమాల్', 'ఆప్ కా సురూర్' చిత్రాలు యావరేజీ కలెక్షన్లను రాబట్టాయి.

తారాతోరణంగా రూపొందిన 'సలామ్-ఏ-ఇష్క్', 'ఏకలవ్య', 'షక లక బూమ్ బూమ్', 'క్యాష్', 'రామ్ గోపాల్ వర్మ కీ ఆగ్', 'దస్ కహానియా' చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో విఫలమయ్యాయి. 'నిశ్శబ్ద్', 'సావరియా', 'ఆజా నాచ్‌లే', 'నఖాబ్', 'ఫూల్ ఎన్ ఫైనల్', 'నో స్మోకింగ్', 'ఖోయా ఖోయా చాంద్', 'గాంధీ మై ఫాదర్' చిత్రాలు సైతం ఫ్లాప్ చిత్రాల శ్రేణిలో మిగిలిపోయాయని అమోద్ పేర్కొన్నారు.

1993 ముంబై బాంబు పేలుళ్లు మరియు గుజరాత్ అల్లర్లను ఆధారంగా చేసుకుని వివాదాస్పదమైన 'బ్లాక్ ఫ్రైడే', 'పర్‌జానియా' చిత్రాలు 2007లో విడుదలయ్యాయి. 'పర్‌జానియా' చిత్రంలో తన నటనకు గాను నటి సారిక జాతీయ పురస్కారాన్ని సాధించారు.


ఈ సంవత్సరపు మరో ప్రధాన అంశంగా బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ మరియు బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ల మధ్య విభేదాలు పొడసూపాయంటూ మీడియా భారీగా ప్రచారం చేయడాన్ని చెప్పుకోవచ్చు. అదేసమయంలో ముచ్చటగా మూడవసారి ప్రసారం కానున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (కేబీసీ) కార్యక్రమంలో హోస్ట్‌ పాత్రను పోషించేందుకు అంగీకరిస్తూ షారూఖ్ ఖాన్ సంతకాలు చేయడంతో ప్రచారాగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. 2001లో తొలిసారిగా ప్రసారమైన కేబీసీకి బిగ్ బీ హోస్ట్‌‌గా వ్యవహరించడంతో ఆ టెలివిజన్ కార్యక్రమం అత్యధిక టీఆర్‌పీకి చేరుకున్న సంగతి తెలిసిందే.