భాగ్యనగరి చరిత్రకు మాయని మచ్చ వరుస పేలుళ్లు

సోమవారం, 24 డిశెంబరు 2007 (12:50 IST)
FileFILE
అంతర్జాతీయ ఐటీ చిత్రపటంలో మెరిసిపోతున్నామని మురిసిపోయినా, గ్రేటర్‌గా ఎదిగామని గర్వించినా, భాగ్యనగరి వాసుల తలరాతలు మాత్రం మారడం లేదు. నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్‌ నగరం మత కల్లోలాలకు, తీవ్రవాదుల దురాగతాలకూ ప్రధాన నిలయంగా మారింది. పండగలు, ప్రార్థన సమయాల్లో నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవల్సిన దుస్థితి నెలకొంది. పాలకుల అలసత్వం, నిఘా విభాగాల లోపం, పోలీసు శాఖల వైఖరి, వివిధ శాఖల సమన్వయ లోపం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.

గత 1986లో జరిగిన హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల నుంచి జంట నగరాల్లో బాంబుల సంస్కృతికి బీజం పడింది. నాడు ఒక పార్టీకి చెందిన నేత శివారెడ్డి బాంబులతో ప్రత్యర్థులను గడగడలాడించాడు. నాటి నుంచి నేటి వరకు.. ఇది నానాటికీ పెరిగుతుందే గానీ తగ్గింది లేదు. ఈ 27 ఏళ్ళ కాలంలో ఎన్నో పేలుళ్లు. ఎందరివో ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ముఖ్యంగా.. ఈ ఏడాది ఆగస్టు 25వ తేదీ రాత్రి లుంబినీ పార్కు, గోకుల్ చాట్‌లలో సంభవించిన వరస బాంబు పేలుళ్లు.. దేశ యావత్తును ఒక్కసారి ఉలిక్కి పడేలా చేశాయి.

ఇలాంటి భారీ పేలుళ్లు జరగడం హైదరాబాద్ చరిత్రలోనే తొలిసారి. ఈ పేలుళ్లలో దాదాపు యాభై మంది ప్రాణాలు కోల్పోగా.. ఎందరో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే ఈ దురాగతానికి భద్రతా వ్యవస్థను కుళ్లు రాజకీయాలు నిర్వీర్యం చేయడమే ప్రధానం కారణం. దీంతో తీవ్రవాదులు, ఉగ్రవాదులు, దేశ ద్రోహులు పేట్రేగి పోతున్నారు. రాజకీయ నేతల అండదండలతో తీవ్రవాదులు, అసాంఘికశక్తులు నగరంలో ఆడుతున్న పైశాచిక క్రీడకు వందలాది మంది అమాయకులు ప్రాణాలు గాలిలో దీపంలా మారుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి