భారత క్రికెట్ లెజండ్.. మాస్టర్ బ్లాస్టర్

సోమవారం, 24 డిశెంబరు 2007 (12:58 IST)
FileFILE
సచిన్ టెండూల్కర్... భారత క్రికెట్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో ఎనలేని పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన క్రికెట్ హీరో. 16 ఏళ్ల ప్రాయం నుంచి ఇప్పటి వరకు.. తనపై వచ్చే విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెపుతూ కెరీర్‌ను కొనసాగిస్తున్న ఏకైక క్రికెటర్ ఈ మాస్టర్ బ్లాస్టర్. తన 16 ఏళ్ళ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని రాటుదేలిన సచిన్.. ఫామ్‌లో లేకుండా జట్టులో స్థానం కోల్పోయిన సంఘటనలు చాలా అరుదు. అయితే ఎల్బో గాయం, వెన్ను నొప్పి కారణంగా జట్టు సేవలకు కొన్ని నెలల పాటు దూరం కావడం జరిగిందేగానీ, శాశ్వతంగా జట్టుకు దూరంకాలేదు.

ప్రస్తుతం జట్టులోని యువతతో పోటీ పడుతూ.. వారికి ఆదర్శంగా ఉంటూ... దేశ క్రికెట్‌కు సేవలు అందిస్తున్నాడు. అలాగే.. టెస్టు హోదా కలిగిన అన్ని దేశాలపై సెంచరీలు చేసిన క్రికెటర్‌గా సచిన్ రికార్డు సృష్టించాడు. వీటిలో ఆస్ట్రేలియాపై సచిన్ పరుగుల వరద పారించాడు. ఆ జట్టుపై తన 19 ఏళ్ళ వయస్సులో చేసిన సచిన్ చేసిన సెంచరీ అత్యుత్తమైన శతకంగా క్రీడా పండితులు పేర్కొంటారు. ఆ తర్వాత కొద్ది రోజులకే క్రికెట్ దిగ్గజం సర్ బ్రాడ్‌మెన్ నుంచి అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా ప్రశంసలు అందుకున్నాడు.

16 ఏళ్ళ చిరు ప్రాయంలోనే అంతర్జాతీయ టెస్టు క్రికెట్ అరంగేట్రం చేసిన సచిన్.. తన 17వ ఏట ఓల్డ్‌ట్రాఫోర్డులో చేసిన తొలి సెంచరీ భారత్‌ జట్టును పరాజయం కోరల నుంచి రక్షించింది. ఆ తర్వాత తాను 25వ పడిలోకి చేరుకునేలోపు 16 సెంచరీలు పూర్తి చేశాడు. అటు టెస్ట్‌లు, ఇటు వన్డేల్లో కలిపి అత్యధిక సెంచరీ (78)లు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు.

ఇప్పటి వరకు మొత్తం 142 టెస్ట్‌లు ఆడిన సచిన్ 55.06 సగటుతో 11,289 పరుగులు చేశాడు. వీటిలో 37 సెంచరీలు, 47 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రెండో స్థానంలో ఉన్నారు. అగ్రస్థానంలో విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా కొనసాగుతున్నాడు. అలాగే.. 407 వన్డేలు ఆడిన సచిన్ 41 సెంచరీలు, 87 అర్థ సెంచరీలతో 15,962 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు 248 (నాటౌట్) కాగా, వన్డేల్లో 186 (నాటౌట్) పరుగులు. అలాగే.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన సచిన్ వన్డేల్లో 154 వికెట్లను, టెస్టుల్లో 42 వికెట్లను పడగొట్టాడు.

సచిన్ కెరీర్‌లో కీలక ఘట్టాలు..
టెస్ట్ అరంగేట్రం... 1989, నవంబరు 15-20 (పాకిస్తాన్).
వన్డే అరంగేట్రం... పాకిస్తాన్, 1989 డిసెంబరు 18 (పాకిస్తాన్).
అవార్డులు...1997లో విస్డన్ క్రికెటర్ అవార్డుకు ఎన్నికైయ్యాడు.

వెబ్దునియా పై చదవండి