భారతీయ అవలోకనం-2007

సోమవారం, 24 డిశెంబరు 2007 (17:29 IST)
FileFILE
కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం అందించిన ఫలాలతో భారతదేశం అభివృద్ధి మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది. ముఖ్యంగా గడచిన సంవత్సరంతో పోల్చి చూసినప్పుడు, ఈ సంవత్సరం పలు రంగాల్లో చోటు చేసుకున్న ఆశావహ దృష్టాంతాలు మిక్కుటంగా కనిపిస్తాయి. కర్షక లోకం నుంచి ఖగోళం దాకా ప్రతి రంగం కూడా ప్రజా బాహుళ్యానికి ప్రయోజనం చేకూర్చే ప్రయత్నంలో తమ అస్తిత్వానికి సరికొత్త మార్గ నిర్దేశనం గావించుకున్నాయి. అదేసమయంలో కడివెడు పాలలో విషం చుక్క వలె చోటు చేసుకున్న పలు సంఘటనలు సగటు భారతీయునికి తీవ్రమైన మనోవేదనను మిగిల్చాయి.ఈ నేపథ్యంలో 2007లో దేశంలో చోటుచేసుకున్న పరిణామాలను సంక్షిప్తంగా అవలోకిస్తే...

ఆరని నందిగ్రామ్ మంటలు...
కొత్త సంవత్సరం (2007)లోకి అడుగుపెట్టిన ఏడో రోజునే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నందిగ్రామ్‌లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నందిగ్రామ్‌లో ప్రత్యేక ఆర్థిక మండలం ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన ఆ గ్రామ ప్రజలపై పోలీసులు తుపాకీ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 14 మంది ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. నాడు ప్రారంభమైన నందిగ్రామ్ మంటలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా.. పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోయింది.

ఎన్నికలు...
గత ఫిబ్రవరి నెల 27వ తేదీన వెల్లడైన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో శిరోమణి అకాలీదళ్-భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి విజయభేరీ మోగించి పంజాబ్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు, భాజపా కూటమికి 67 స్థానాలు, ఇతరులు ఐదు స్థానాలు వచ్చాయి. అలాగే.. మే నెల ఏడో తేదీన ఏడు దశలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ బంపర్ మెజారిటీతో యూపీ పీఠాన్ని కైవసం చేసుకుంది.

దేశంలోని రాష్ట్రాల్లో అతి పెద్ద రాష్ట్రంగా పేరుగాంచిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధినేత్రి మాయావతి ప్రమాణ స్వీకారం చేశారు. 402 స్థానాలు కలిగిన యూపీ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చావుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కేవలం 22 స్థానాలతో పరిమితమైంది. జూన్ నెల ఆరో తేదీన వెల్లడైన గోవా అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తం 40 స్థానాలకు గాను కాంగ్రెస్ 16, భాజపా 14, ఎన్సీపీ-03, ఇతరులు ఏడు స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేసింది.

తొలి మహిళా రాష్ట్రపతి...
భారతదేశ చరిత్రలో రాష్ట్రపతి పీఠాన్ని తొలిసారిగా ఒక మహిళ అధిరోహించారు. గత జులై నెల 25వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో దేశ 12వ రాష్ట్రపతిగా ప్రతిభాపాటిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆగస్టు పదో తేదీన జరిగిన ఎన్నికల్లో ఉపరాష్ట్రపతిగా జాతీయ మైనార్టీ కమషన్ ఛైర్మన్‌గా ఉన్న మహ్మద్ అన్సారీ ఎన్నికయ్యారు.

FileFILE
యూపీఏకు గుదిబండగా మారిన అణు ఒప్పందం...
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్‌ భవిష్యత్‌ను దష్టిలో ఉంచుకుని... ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి, భవిష్యత్ విద్యుత్‌ అవసరాల కోసం అమెరికాతో చేతులు కలపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా.. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని నాటి వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

దీన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అమలుకు తెచ్చేందుకు ప్రయత్నించింది. చివరకు ఆ అణు ఒప్పందమే యూపీఏ ప్రభుత్వానికి గుదిబండగా మారింది. అణు ఒప్పందంలోని హైడ్ బిల్లులోని కొన్ని అంశాలపై యూపీఏ కీలక భాగస్వామి అయిన వామపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో.. ఒప్పందం అమలు ప్రశ్నార్థకంగా మారింది.

కోర్టు తీర్పులు...
1993లో జరిగిన ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసు తుదితీర్పు వెలువడింది. ఈ కేసులో అక్రమంగా తుపాకీ కలిగి ఉన్నందుకు ఆయుధ చట్టం కింద ముంబై ప్రత్యేక కోర్టు ఆరేళ్లు జైలు శిక్ష విధించింది. కొద్ది రోజుల పాటు.. జైలు శిక్ష అనుభవించిన అనంతరం సుప్రీం కోర్టు అనుమతితో విడుదలయ్యారు. అలాగే.. కష్ణ జింకల వేట కేసులో మరో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టు జైలు శిక్ష విధించింది. ప్రపంచ క్రికెట్‌ బెట్టింగ్ ఆరోపణలు రావడంతో వినోద్, అనూప్ కుమార్, అమిత్ కుమార్ తదితరులను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.

నేరాలు... ఘోరాలు...
ఫిబ్రవరి నెల 18వ తేదీన హర్యానా రాష్ట్రంలో పానిపట్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. పాక్-భారత్‌ల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబులు పేలగా.. 68 మంది దుర్మరణం పాలయ్యారు. మరో వందమందికి పైగా గాయాల పాలయ్యారు. హైదరాబాద్‌లోని చారిత్రక మక్కా మసీదులో మే నెల 18వ తేదీన జరిగిన బాంబు పేలుళ్లలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. యాభై మందికి పైగా గాయపడ్డారు. భారతదేశ చరిత్రలో ఒక మసీదులో బాంబు పేలడం ఇదే తొలిసారి.

జులై ఏడో తేదీన ముంబై మహానగరంలోని సబర్బన్ రైళ్లలో ఏడు చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 209 మంది మృత్యువాత పడ్డారు. మరో 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుళ్లకు లష్కర్ తోయిబా తీవ్రవాదులు కారణమని పోలీసులు దర్యాప్తులో నిర్థారించారు. అలాగే.. ఆగస్టు 30వ తేదీన హైదరాబాద్‌లోని లుంబిని పార్కు, గోకుల్ చాట్‌లలో ఒకే సమయంలో పేలిన వరుస బాంబు పేలుళ్లలో 35 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

FileFILE
మరో యాభై మందికి పైగా గాయపడ్డారు. అక్టోబరు 27వ తేదీన జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీని మావోయిస్టు తీవ్రవాదులు హతమార్చారు. ఈ దాడిలో మరో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. నవంబరు 23వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో, వారణాసి, ఫైజాబాద్‌లలో ఒకే సమయంలో ఏడు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఇందులో ఐదు మందితో పాటు. 13 మంది గాయపడ్డారు.

ఆధునిక పరిజ్ఞానం...
హైదరాబాద్‌లోని సునామీ హెచ్చరిక కేంద్రంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు కొత్త పరికరాలను అమర్చారు. వీటివల్ల సునామీ ఏర్పడేందుకు 13 నిమిషాల ముందు.. కనుగొనే వీలుకలిగింది. అలాగే.. శ్రీహరి కోటలోని సతీష్ థావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ఇటలీకి చెందిన ఉపగ్రహాన్ని పీఎస్ఎల్పీ-సి8 అంతరిక్ష కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.

వివాదాస్పదం...
గత ఏప్రిల్ నెల 30వ తేదీన జరిగిన ఎయిడ్స్ అవగాహనాలో భాగంగా.. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో 30 వేల మంది లారీ డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హాలీవుడ్ నటుడు రిచర్డ్ గోరీ, బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని బహిరంగంగా ముద్దాడారు. ఇది పెను సంచలనే సృష్టంచగా... హాలీవుడ్ నటుడు నటికి క్షమాపణ చెప్పారు.

ముగిసిన ప్రేమకథ ఎపిసోడ్...
బాలీవుడ్‌లో కొద్దిరోజుల పాటు.. ఎన్నో ఎపిసోడ్‌లుగా నడిచిన అభి-ఐష్ ప్రేమ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది ఈ ఏడాదే. వీరి వివాహం ఏప్రిల్ 20వ తేదీన ముంబైలోని అమితాబ్ నివాసంలో అతి ముఖ్యలు, సన్నిహితులు మధ్య జరిగింది.