భారతీయ చదరంగానికి మైలురాయి 2007

సోమవారం, 24 డిశెంబరు 2007 (17:30 IST)
FileFILE
భారతీయ చదరంగ చరిత్రలో 2007 సంవత్సరం సువర్ణాక్షరాలను లిఖించింది. చదరంగపు క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ ర్యాంకింగ్ జాబితాలో అగ్రశ్రేణిలో నిలవడంతోపాటు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడం ఈ సంవత్సరానికి అత్యంత విశిష్టతను తీసుకువచ్చింది.

గడచిన 15 సంవత్సరాలుగా టాప్ త్రీలో తన స్థానాన్ని పదిలపరుచుకుంటూ వస్తున్న ఆనంద్, తన రెండు దశాబ్దాల చదరంగ క్రీడా ప్రస్థానంలో తొలిసారిగా ఫైడ్ ప్రపంచ ర్యాంకింగ్ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అదేసమయంలో ప్రపంచ ఛాంపియన్ షిప్‌తోపాటు ఈఎల్ఓ రేటింగ్‌లో 2800 ను పొందడం ద్వారా తనకు మాత్రమే కాక యావత్ భారతదేశానికి 2007 సంవత్సరాన్ని మరుపురానిదిగా మిగిల్చాడు.

ఒకవైపు ఆనంద్ చదరంగపు ఎత్తుగడలు అప్రతిహతంగా సాగుతుండగా, మరోవైపు కోనేరు హంపి సైతం తన ఎత్తులను కొనసాగిస్తూ ఈఎల్ఓ రేటింగ్‌లో 2600 ను పొందడం ద్వారా హంగేరీకి చెందిన క్రీడాకారిణి జ్యూడిట్ పోల్‌గార్ తర్వాత ఈఎల్ఓ రేటింగ్‌ను సాధించిన ప్రపంచస్థాయి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 2006 సంవత్సరంలో దోహాలో జరిగిన ఆసియా క్రీడలలో స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్న హంపిని భారత ప్రభుత్వ పురస్కారమైన పద్మశ్రీ వరించింది.

భారతీయ చదరంగంలో సౌందర్యవతిగా పేరొందిన తానియా సచ్‌దేవ్ ఆసియా మహిళా టైటిల్‌ను గెలుచుకోవడంతో పాటు జాతీయ మహిళా 'ఏ' కిరీటాన్ని వరుసగా రెండవసారి కూడా కైవసం చేసుకుంది.

ఇక ఈఎల్ఓ రేటింగ్‌లో 2700ను సాధించిన కృష్ణన్ శశికిరణ్ సైతం తన కెరీర్‌లో కొత్త శిఖరాలకు చేరుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి