మన పొరుగుదేశాలు రాజకీయాలు

సోమవారం, 24 డిశెంబరు 2007 (18:46 IST)
FileFILE
2007 సంవత్సరంలో అంతర్జాతీయంగా చోటు చేసుకున్న ఘటనలు హాలీవుడ్ చిత్రాన్ని తలదన్నే రీతిలో ఉన్నాయని చెప్పుకోవడం అతిశయోక్తి కాదు. ఆధునిక యుగంలో సైతం మధ్య యుగపు మనస్తత్వాలకు అద్దంపట్టే సంఘటనలను మనం ప్రత్యక్షంగా చూశాము.

భారత్ పొరుగుదేశాలైన పాకిస్థాన్, మియాన్మార్, నేపాల్ తదితర దేశాలలో రాజకీయపు ఎత్తుగడలను చూసిన మన నేత్రాలు, అదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్ మరియు ఇరాక్‌లో చోటు చేసుకున్న నరమేధానికి దుఃఖాశ్రువులను చిందించాయి.

వీటన్నిటి మధ్య బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న ప్రకృతి వైపరీత్యాలు గ్లోబల్ వార్మింగ్ తాలూకు దుష్పరిణామాలను కళ్ళకు కట్టినట్లుగా చూపాయి. ఇదేసమయంలో గ్లోబల్ వార్మింగ్‌ నుంచి జనావళిని కాపాడుకునేందుకు ఉద్దేశించిన జెనీవా సదస్సు అగ్రరాజ్యాల ఆధిపత్య దోరణులతో ఎటువంటి సత్ఫలితాలను సాధించకుండానే అసంపూర్ణంగా ముగిసింది.

సంక్షోభంలో పాకిస్థాన్‌ : అన్ని వైపులా వ్యతిరేక పవనాలు చుట్టుముట్టడంతో తన పీఠాన్ని కాపాడుకునేందుకు పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్, దేశ ప్రజలను అత్యయిక పరిస్థితిలో ఉంచారు. ఎమర్జెన్సీకి మునుపు పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో పునరాగమనం సందర్భంగా కరాచీలో చోటు చేసుకున్న బాంబు పేలుళ్ళను ఎమర్జెన్సీ వాహనానికి ఇంధనంగా వాడుకోవడంలో ముషారఫ్ శాంతి కపోతం పాత్రను సమర్ధవంతంగా పోషించి, అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్ళ నడుమ ముషారఫ్ ఎమర్జెన్సీ పాలన అటకెక్కింది.

ఇరాన్-ఉత్తర కొరియా : అమెరికా నుంచి ఏ క్షణంలోనైనా తమపై యుద్ధ మేఘాలు కమ్ముకోవచ్చుననే సంశయం ఇరాన్, ఉత్తర కొరియాలు స్వీయ పరిజ్ఞానంతో అణు కేంద్రాలను నిర్మించుకునేందుకు పురిగొల్పింది. అదే సమయంలో చైనా మరియు రష్యా దేశాల అండదండలు సదా తమ వెంట ఉంటాయన్న ధీమాతో పలు రూపాలలో అమెరికా బెదిరించినప్పటికీ ఉభయ దేశాలు తమ అణు కార్యక్రమాలను విరమించుకోలేదు.

FileFILE
ఆఫ్ఘనిస్థాన్-ఇరాక్ : అమెరికా సేనల ప్రవేశంతో ఇరు దేశాల ప్రజలకు సామాన్య జీవనం కరువైపోయింది. అల్‌ఖైదా తీవ్రవాద సంస్థను కూకటి వేళ్లతో పెకలిస్తామంటూ ప్రకటనలు గుప్పించిన అమెరికా సైన్యాధిపతులు, అందులో పూర్తిగా విఫలమైయ్యారని చెప్పడానికి నిదర్శనాలు అనేకం. దీంతో అమెరికా సైన్యం వెనక్కు మళ్ళితే తమ గతేమిటనే విచిత్రమైన పరిస్థితిని ఆయాదేశాల ప్రధాని మరియు రాష్ట్రపతులు ఎదుర్కుంటున్న వైనం అంతర్జాతీయ సమాజానికి సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తోంది.

బంగ్లాదేశ్-నేపాల్ : సుధీర్ఘకాలంగా ఆపద్ధర్మ ప్రభుత్వాల పాలనలో మనుగడ సాగిస్తున్న దేశాలుగా బంగ్లాదేశ్, నేపాల్‌లు చరిత్రను సృష్టిస్తాయనడంలో సందేహం లేదు. అడవుల నుంచి రాచరిక ప్రభుత్వంపై పోరాటం సాగిస్తూ వచ్చిన మావోయిస్టులు, రాచరిక వ్యవస్థను కుప్పకూల్చడంలో ఘన విజయం సాధించారు.

అయితే పదవుల పంపకంలో అష్టపక్షాల కూటమి మధ్య చోటు చేసుకున్న బేధాలు ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని చిరంజీవిని చేస్తున్నాయి. ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధానులైన ఖలేదా జియా మరియు షేక్ హసీనాల మధ్య చోటు చేసుకున్న అంతర్‌యుద్ధం ఆ దేశానికి ఆపద్ధర్మ ప్రభుత్వ పాలనవైపు నెట్టింది.

శ్రీలంక-మియన్మార్ : అనాదిగా జాతుల మధ్య చోటు చేసుకున్న వైరం ఇరుదేశాల పాలిట ప్రాణ సంకటంగా పరిణమించింది. 2007 సంవత్సరంలోనే గగన తలం నుంచి శ్రీలంక సైనిక స్థావరాలపై దాడుల జరిపే ఆయుధ పాటవాన్ని తాము కలిగి ఉన్నట్లు తమిళ టైగర్లు తమ క్రియా శీలత ద్వారా చాటుకున్నారు. ఇక మియన్మార్ పాలకులు బౌద్ధారామాలపై, బౌద్ధ బిక్షువులపై దాడులతో అంతర్జాతీయ సమాజం నుంచి పలు ఆంక్షలను ఎదుర్కుంటున్నారు.