'యువతరం' భుజస్కంధాలపై 'టీమ్ ఇండియా' భవితవ్యం

సోమవారం, 24 డిశెంబరు 2007 (10:54 IST)
FileFILE
భారత క్రికెట్ జట్టుకు కాగితంపై పులి... మైదానంలో పిల్లి అనే అపవాదు వుంది. ప్రపంచంలోనే అత్యుత్తమైన బ్యాటింగ్ లైనప్ "టీమ్ ఇండియా" సొంతం. అయితే.. మైదానంలో దిగితే ప్రత్యర్థి బౌలింగ్‌కు దాసోహం కావడం మైనస్ పాయింట్. ఆది నుంచి ఈ బలహీనతను అధిగమించేందుకు భారత జట్టు ఎంతో కృషి చేస్తోంది... చేస్తూనే వుంది. అయితే.. అది ఎండమావిగానే మిగిలిపోతోంది. అలాగే.. 2007 సంవత్సరం భారత జట్టుకు కొంత చేదు, కొంత తీపి గుర్తులను మిగిల్చింది. ఏడాది కాలంలో భారత జట్టు ఎదుర్కొన్న ఒడిదుడుకులను ఒక సారి అవలోకనం చేస్తే...

ఈ ఏడాది ఆరంభంలో తొమ్మిదో ప్రపంచ కప్ జరిగింది. తొమ్మిది దీవుల సమ్మేళనమైన వెస్టిండీస్ ద్వీపకల్పంలో జరిగిన ఈ ప్రపంచ కప్‌లో "టీమ్ ఇండియా" ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే.. ఆ తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన "ట్వంటీ-20" ప్రపంచకప్‌లో జార్ఖండ్ డైనమెట్ ధోనీ నేతృత్వంలోని "ధోనీ యువసేన" ప్రపంచ విజేతగా ఆవిర్భవించింది. ఇలా ఆరంభమైన "టీమ్ ఇండియా" ప్రస్థానం... 2007 సంవత్సరంలో నాటకీయ పరిణామాల మధ్య మీడియాకు మంచి సమాచారాన్ని అందించే సరుకుగా వాసికెక్కింది.

ప్రపంచ కప్ ఘోర పరాజయం అనంతరం భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటన నుంచి అనూహ్యంగా పుంజుకున్న భారత జట్టు ఆ తర్వాత టొరంటో గడ్డపై జరిగిన ముక్కోణపు వన్డే టోర్నీలోను మంచి ప్రతిభను కనపరిచారు. ఈ ఫ్యూచర్ కప్‌ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా జట్టును ఖంగుతినిపించిన టీమ్ ఇండియా, కప్‌ను ఎగురేసుకుంది. ఆ తర్వాత అటునుంచి ఇంగ్లాండ్‌ పర్యటనకు శ్రీకారం చుట్టింది. ఈ పర్యటనలో ద్రావిడ్ సేన తొలి సారిగా ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్‌ను కోల్పోయింది. అటుపిమ్మట జరిగిన ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో సీనియర్లు బరిలో లేకున్నా యువసేన మాత్రం విశ్వవిజేతగా మాతృభూమిపై కాలుమోపింది. ఆ సమయంలో యువసేనకు లభించిన స్వాగతం క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రమకు గురిచేసింది. అనంతరం సొంత గడ్డపై పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ను కైవసం చేసుకోవడమే కాకుండా.. వన్డే సిరీస్‌ను సైతం సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్‌లో ఏకఛత్రాధిపత్యాన్ని చాటుకుంటున్న భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ)కి, ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) రూపేణా పోటీ ఎదురైంది. టీమ్ ఇండియాకు కొత్త కోచ్‌ను సమకూర్చుకోవడంలో అనేక వైఫల్యాలు, ఆటగాళ్లపై వివాదాస్పదమైన ఆంక్షలు, సెలక్టర్లు కథనాలు రాయకూడదంటూ పాత నిబంధనలకు కొత్త శక్తిని నింపే క్రమంలో బీసీసీఐ ఈ ఏటి వార్తల్లో మేటిగా నిలిచింది.

వ్యక్తిగత విజయాలను అవలోకించినట్లయితే బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ తన కెరీర్‌లో అత్యుత్తమంగా నిలిచే మొదటి డబుల్ సెంచరీని చేసి సీనియర్లలో చేవ తగ్గలేదని క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాడు. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ పగ్గాలను వీడగా, మహేంద్ర సింగ్ ధోని వన్డే నాయకత్వాన్ని అందిపుచ్చుకున్నాడు. అదే క్రమంలో "వికెట్ జంబో"గా అభిమానులు పిలుచుకునే అనిల్ కుంబ్లేను టెస్ట్ మ్యాచ్ కెప్టెన్సీ వరించింది. బీసీసీఐ సుధీర్ఘ కాలం జరిపిన అన్వేషణ ఫలితంగా టీమ్ ఇండియా కోచ్‌గా దక్షిణాఫ్రికా ఓపెనర్ గ్యారీ కిరిస్టెన్ నియమించబడ్డాడు.

తాము ఇంకా సంపూర్ణమైన ఫిట్‌నెస్‌తో ఉన్నామని సీనియర్ ఆటగాళ్ళు నిరూపించుకున్న తరుణంలోనే, సీనియర్లతో సమంగా తాము ఆడగలమనే ధీమాను యువ ఆటగాళ్ళు కనపరిచిన వైనానికి 2007 సంవత్సరం తార్కాణంగా నిలుస్తోంది. అంతేకాక సత్తాను చూపే ఎందరో కుర్రకారుకు ఈ సంవత్సరం స్వాగతం పలకడం ద్వారా సత్‌ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది.

వెబ్దునియా పై చదవండి