రాష్ట్ర రాజకీయాలలో 'మధ్యంతర' ప్రకంపనలు

మంగళవారం, 25 డిశెంబరు 2007 (15:12 IST)
FileFILE
రాష్ట్రంలో 2007 సంవత్సరపు రాజకీయాలు మధ్యంతర ఎన్నికలు వచ్చేసినంత హడావుడి చేశాయి. ఎన్నికల ప్రణాళికను పరిగణనలోకి తీసుకున్నట్లయితే 2009 సంవత్సరంలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కానీ అధికార, ప్రతిపక్షాలు మధ్యంతరాన్ని స్వాగతించే రీతిలో రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించాయి.

అదేసమయంలో సినీనటుడు చిరంజీవి రాజకీయ ఆరంగేట్రం చేయనున్నారనే వార్తలు ఊపందుకోవడంతో రాజకీయ పక్షాలకు ఎన్నికల జ్వరం మరింత పెరిగింది. ప్రధానంగా ఈ సంవత్సరాంతంలో చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా చిరు అభిమానులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.

దశాబ్దాల కాలపు కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడిన వెండితెర వేలుపు ఎన్ టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ స్థాయిలోనే తమ అభిమాన హీరో కూడా చరిత్ర సృష్టిస్తారనే అభిమానుల ఆరాటం తాలూకు ఊరేగింపులకు, సమావేశాలకు రాష్ట్రం సాక్షీభూతంగా నిలిచింది.

తన రాజకీయ రంగ ప్రవేశంపై చిరంజీవి పెదవి విప్పనప్పటికీ, అందుకు సంబంధించిన నేపథ్య కార్యకలాపాలు చాపకింద నీరులా సాగుతున్నాయని, సరియైన సమయంలో చిరంజీవి రాజకీయాల్లోకి అడుగిడుతారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.

పాలిత కాంగ్రెస్ పక్షం, 2004 ఎన్నికలలో వామపక్షాలు, తెలంగాణా రాష్ట్రసమితితో కలిసి పోటీ చేసి గెలిచినప్పటికీ, ప్రస్తుతం మిత్ర పక్షాలతో సంబంధాలు సవ్యదిశలో సాగటం లేదు. మరోవైపు వామపక్షాలతో తెగిపోయిన బంధాన్ని పునరుద్ధరించుకునేందుకు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం కసరత్తు ప్రారంభించింది.

పేదలకు సాగు భూమి మరియు ఇళ్ల స్థలాల కోసం మే నెలలో వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉద్యమం, వామపక్షాల కార్యకర్తలపై ముదిగొండలో పోలీసు కాల్పులతో కాంగ్రెస్ మరియు వామపక్షాల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి.

FileFILE
వివాదాస్పద రచయిత తస్లీమా నస్రీన్‌‌పై దాడి, నీలోఫర్ ఆసుపత్రి వైద్యసిబ్బందిపై తెగబడటం ద్వారా మిత్రపక్షమైన ఎమ్ఐఎమ్, కాంగ్రెస్‌కు లేనిపోని తలనెప్పులు తెచ్చిపెట్టింది.

కేంద్రంలో తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు దిశగా తెదెపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాంతీయ పార్టీలతో కూడిన యూఎన్‌పీఏ ఏర్పాటుకు నాంది పలికారు. సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పీ) మరియు అస్సాం గణ పరిషత్ (ఏజీపీ) తదితర రాజకీయ పక్షాలతో ప్రారంభమైన యూఎన్‌పీఏ ఆధ్వర్యంలో రైతు సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన తొలి బహిరంగ సభ విజయవాడలో జరిగింది.

తన తొమ్మిదేళ్ల పాలనలో హైటెక్ ముఖ్యమంత్రిగా పేరొందిన చంద్రబాబు నాయుడు తన వైఖరిని మార్చుకున్నట్లుగా ఈ సంవత్సరంలోనే ప్రకటించుకున్నారు. ఆర్థికాభివృద్ధి ఫలాలు పేద ప్రజలకు చేరువ చేసేందుకు వామపక్ష విధానాలను పాటిస్తామని చెప్పుకొచ్చారు.

రైతు సమస్యలపై సరియైన దృష్టిని పెట్టకపోవడంతో తాను అధికారాన్ని కోల్పోయినట్లు గ్రహించిన చంద్రబాబు, తాము తిరిగి అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తామంటూ ప్రకటించారు.

అదేసమయంలో తామేమీ తీసిపోమన్న రీతిలో స్వర్గీయ ఎన్ టీ రామారావుకు ప్రియ పథకమైన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని వచ్చే సంవత్సరం నుంచి పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పాలిత ప్రభుత్వం ప్రకటించింది.

రైతులు, చేనేత కార్మికులకు మూడు శాతం వడ్డీకి రుణాలు అందిస్తామంటూ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి హామి ఇచ్చారు.

FileFILE
శాసన మండలికి పోటీ చేసి గెలిచిన స్వతంత్ర అభ్యర్థి కె జ్ఞానేశ్వర్‌కు అనుకూలంగా పార్టీ అసమ్మతి శాసనసభ్యులు ఓటింగ్ చేయడం, మనుషులు అక్రమ రవాణాలో పాత్ర ఉన్నదంటూ కేంద్ర మాజీ మంత్రి మరియు పార్టీ సీనియర్ నేతపై పార్టీ బహిష్కరణ వేటుతో తెలంగాణా రాష్ట్ర సమితి బలహీనపడిన వైనం ఈ సంవత్సరంలోనే చోటు చేసుకుంది.

కరీంనగర్ లోక్ సభ ఎన్నికలో తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు భారీ మెజారిటీతో గెలుపొందడంతో, తెలంగాణా సెంటిమెంట్ రగులుతోందనే నిర్ణయానికి ప్రధాన రాజకీయ పక్షాలు రాక తప్పని పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై తుది నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వదిలివేసినట్లు కాంగ్రెస్ శ్రేణులు పలు సందర్భాలలో పేర్కొన్నప్పటికీ, ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు మధు యాష్కీ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్ సత్యనారాయణరావులు తెలంగాణా రాగాన్ని ఆలపిస్తూనే ఉన్నారు.

ఆది నుంచి దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ వస్తున్న వామపక్షాలు, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తాము అడ్డంకి కాదంటూ మెతకదోరణిని అవలంభించాయి.

రెండో ఎస్సార్సీ ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్ఠానం ఏకాభిప్రాయ సాధనలో ఒకవైపు చెప్తుండగా, మరోవైపు యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచి, పార్లమెంటులో తెలంగాణా బిల్లును ప్రవేశపెట్టే దిశగా భారతీయ జనతా పార్టీ "తెలంగాణా రాష్ట్ర ఉద్యమ కమిటీ"ని నెలకొల్పింది.

కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికలో ఘోర పరాజయాన్ని చవిచూసిన తెలుగు దేశం, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంపై తగిన సమయంలో స్పందిస్తామంటూ "మహానాడు"లో హామీ ఇవ్వడం ద్వారా సమైక్యాంధ్ర నినాదానికి సవరణలు మొదలుపెట్టింది.

మరో 18 నెలలలో లోక్‌సభ మరియు శాసనసభలకు ఎన్నికలు ముంచుకు రానున్న తరుణంలో ఒకే భావజాలం కలిగిన రాజకీయ పక్షాలు, సంస్థలను కలగలుపుకుని రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలైన బీసీలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు మైనార్టీలకు ఆసరాగా నిలిచేందుకు ఉద్దేశించిన తృతీయ ప్రత్యామ్నాయాన్ని రాష్ట్రంలో నెలకొల్పేందుకు సీపీఐ ప్రయత్నాలు ప్రారంభించింది.

కులాల సమీకరణాలతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయవతి ఎన్నికలకు ముందు చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో, రాష్ట్ర రాజకీయాలలో రెండు కులాల ఆధిపత్యానికి అడ్డు చెప్పేందుకు అన్నట్లుగా మాయవతి ప్రయోగాన్ని రాష్ట్రంలోని కొన్ని వర్గాలు అందుకున్నాయి.