ఆంధ్రప్రదేశ్ శాసనసభ పోల్స్ : నెల్లూరులో టీడీపీ సున్నా.. వైకాపా 10

గురువారం, 23 మే 2019 (10:46 IST)
ఏపీ శాసనసభ ఎన్నికల్లో భాగంగా, నెల్లూరు జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో ఫ్యాను గాలి బలంగా వీచింది. ఫలితంగా మొత్తం 10 సీట్లకుగాను వైకాపా అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. అధికార టీడీపీకి చెందిన అభ్యర్థులు ఒక్కరు కూడా ఆధిక్యాన్ని చూపలేకపోయారు. ముఖ్యంగా ఈ జిల్లాకు చెందిన మంత్రులు పి.నారాయాణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు కూడా వెనుకంజలో ఉన్నారు. 
 
అలాగే, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జనసేన ప్రభావం కనిపించడం లేదు. ఆ పార్టీకి ఎక్కడా ఆధిక్యం లభించలేదు. తొలుత ఒకటి రెండు స్థానాల్లో ఆధిక్యం లభించినా, ఆ తర్వాత  ఎక్కడా లీడ్‌లోకి రాలేదు. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ వెనుకంజలో ఉండటం గమనార్హం.
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభా ఎన్నికల్లో వైకాపా జోరు కొనసాగుతోంది. దాదాపు 143కు పైగా శాసనసభా స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. తెదేపా సుమారు 28 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉండటం గమనార్హం. పలువురు మంత్రులు కూడా వెనుకంజలో ఉన్నారు. అచ్చెన్నాయుడు, కిడారి శ్రవణ్‌, నారాయణ, అఖిలప్రియా రెడ్డి, లోకేశ్‌, సోమిరెడ్డి, అయ్యన్న పాత్రుడు, చినరాజప్పలు వెనుకంజలో ఉండగా, దేవినేని ఉమ, జవహర్‌ తదితరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
అదేవిధంగా ఎన్డీయే కూటమి ఏకంగా 325 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో భాజపా హవా కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 20 వేల ఓట్ల ఆధిక్యంలో ఉండగా, అమిత్‌షా లక్షా 50 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు