వైకాపా నుంచి మరో వికెట్ డౌన్... కాషాయం కండువా కప్పుకున్న గూడూరు ఎమ్మెల్యే!!

వరుణ్

ఆదివారం, 24 మార్చి 2024 (14:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా నుంచి మరో వికెట్ పడిపోయింది. గూడూరు ఎమ్మెల్యే, ఐఏఎస్ మాజీ అధికారి వరప్రసాద్ కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనను బీజేపీ నేతలు సాదర స్వాగతం పలికారు. కాగా, ఈయన రానున్న ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ ధావడే సమక్షంలో ఆయన బీజేపీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. 
 
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా అధిష్టానం పలువురు పెద్దలకు టిక్కెట్లు నిరాకరించిన విషయం తెల్సిందే. మరికొందరిని ఇతర నియోజకవర్గాలకు వలస పంపించింది. టిక్కెట్ దక్కని వారిలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ఒకరు. ఈయన స్థానంలో గూడూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎం. మురళీధర్‌కు టిక్కెట్ కేటాయించింది. దీంతో వరప్రసాద్ కాషాయం పార్టీలో చేరిపోయారు. 
 
కాగా, బీజేపీలో చేరిన వరప్రసాద్ తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. తిరుపతి నియోజకవర్గం నుంచి ఆయనకు కొత్త కాదు. గత 2014లో తిరుపతి ఎంపీగా గెలిచారు. 2019లో గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇపుడు మళ్లీ బీజేపీ తరపున తిరుపతి లోక్‌సభకు పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకోనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు