ముద్రగడ అనుమతి తీసుకున్న తర్వాత ముద్రగడ క్రాంతిని జనసేనలో చేర్చుకుంటా : పవన్ కళ్యాణ్

ఠాగూర్

సోమవారం, 6 మే 2024 (09:18 IST)
తనపై విమర్శలు గుప్పిస్తున్న ముద్రగడ పద్మనాభం పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు పెద్ద మనసు ప్రదర్శించారు. ముద్రగడ కుమార్తె ముద్రగడ క్రాంతి జనసేన పార్టీలో చేరేందుకు రాగా పవన్ కళ్యాణ్ వారించారు. ఒక కుటుంబాన్ని విడదీసే అలవాటు తనకు లేదన్నారు. తల్లీ కుమార్తెలను ఒకచోట కూర్చోబెట్టి మాట్లాడాతనని, ముద్రగడ పద్మనాభం అనుమతి తీసుకున్న తర్వాతే క్రాంతిని జనసేన పార్టీలో చేర్చుకుంటానని చెప్పారు. 
 
కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగించారు.  'ముద్రగడ పద్మనాభంగారి కుమార్తె జనసేన పార్టీకి మద్దతుగా మాట్లాడారు. అందుకు నేనే కారణం అంటూ నన్ను తిడుతున్నారు. నేను కులాలను, మనుషులను కలిపే వ్యక్తిని తప్ప... కుటుంబాలను విడదీసే వ్యక్తిని కాను. ముద్రగడ పద్మనాభంతో నాకు విభేదాలు లేవు. ఆయన కుటుంబాన్ని విడదీయాలనే ఆలోచన లేదు.
 
ఆయన కుమార్తె మన పార్టీ మీద నమ్మకంతో వచ్చారు. ఆమెను నా సోదరిలా గౌరవించే బాధ్యత నేను తీసుకుంటాను. అయితే ముద్రగడ కుమార్తె జనసేన పార్టీలో చేరే అంశంపై నేను ముద్రగడగారితో మాట్లాడి ఆయన అనుమతి తీసుకుంటాను. పెద్దవాళ్లు పది మాటలు అంటారు... నేను ముద్రగడను, ఆయన కుమార్తెను కలుపుతాను. వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ముద్రగడ పద్మనాభంగారి కుమార్తె క్రాంతిని ఎమ్మెల్యేగా నిలబెడతాను... గౌరవిస్తాను. ముద్రగడ వైసీపీకి వెళితే మాకేమీ లేదు. ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తాను' అని స్పష్టం చేశారు. 
 
బూతులు, మూడు కబ్జాలు, ఆరు సెటిల్మెంట్లు... వైసీపీ ప్రభుత్వం గురించి ఇంతకంటే బాగా చెప్పలేం అని అన్నారు. పోలవరం నిర్మించడం సంగతి అటుంచితే కనీసం చెరువుల్లో పూడిక కూడా తీయించడం చేతకాని ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. ఓడిపోయేవాడే దాడులు చేస్తాడని, వైసీపీ ఓడిపోతోంది కాబట్టే మనవాళ్లపై దాడులకు దిగుతున్నారు అంటూ పవన్ పేర్కొన్నారు. సొంతచెల్లెలికి ఆస్తులు ఇవ్వడు, తల్లికి గౌరవం ఇవ్వడు, 30 వేల మంది ఆడపిల్లలు కనిపించుకుండా పోతే స్పందించని వ్యక్తి, విశాఖలో రూ.25 వేల కోట్ల విలువైన భూములు తాకట్టు పెట్టిన వ్యక్తి... రేపు మీ భూముల జోలికి రాడని గ్యారెంటీ ఏంటి అని పవన్ ప్రశ్నించారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు