ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. ఆయనకు మొత్తం ఆస్తులు రూ.529.87 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు. అయితే, గత ఐదేళ్ల కాలంలో ఆయన ఆస్తులు ఏకంగా 41 శాతం పెరిగాయి. అలాగే, ఆయన భార్య వైఎస్ భారతి పేరిట మరో రూ.176.63 కోట్ల ఆస్తులు ఉన్నాయి.
పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ తరపున సోమవారం ఆయన చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అధిడవిట్లో జగన్ తన చరాస్తుల విలువను రూ.483,08,35,064, స్థిరాస్తుల విలువను రూ.46 కోట్లుగా పేర్కొన్నారు. తన చేతిలో కేవలం రూ.7 వేలు నగదు ఉన్నట్టు చూపారు. అలాగే తన సతీమణి భారతి పేరిట రూ.119,38,07,190 విలువైన చరాస్తులు, రూ.56 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు చూపించారు. వీరిద్దరి పేరిట మొత్తం రూ.706.50 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు. భారతి వద్ద రూ.10,022 నగదు, పెద్ద కూతురు హర్షిణీరెడ్డి వద్ద రూ.3 వేలు, రెండో కూతురు వర్షిత రెడ్డి వద్ద రూ.6.980 నగదు ఉన్నట్టు ఆఫిడవిట్‌లో తెలిపారు. నలుగురి పేరిట నగదు మొత్తం రూ.40 వేలు కూడా లేకపోవడం గమనార్హం.
ఇద్దరు కుమార్తెల పేరిట 51.50 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో జగన్ ఆస్తి రూ.375.20 కోట్లు ఉండగా, ఐదేళ్లు తిరిగే సరికి ఆయన సంపద దాదాపు 41 శాతం పెరిగింది. భార్య, పిల్లల ఆస్తులు కూడా భారీగా పెరిగాయి. 2019 ఎన్నికల్లో భారతి పేరిట రూ.124 కోట్లు, ఇద్దరు కుమార్తెల పేరిట రూ.11 కోట్లు ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు. 2022-23లో ఆదాయప చూపించి ఆదాయం జగన్‌కు రూ.47,74,90,600, భారతికి రూ.10.96 కోట్లుగా ఉంది.