రాష్ట్ర విభజనకు హైదరాబాదే పీఠముడి: మంత్రి జైపాల్ రెడ్డి

సోమవారం, 10 జనవరి 2011 (15:46 IST)
రాష్ట్ర విభజనకు హైదరాబాదే ప్రధాన పీఠముడిగా ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఎస్.జైపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు నేతలు, మంత్రులు సోమవారం ఢిల్లీలో జైపాల్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హైదరాబాదే ఓ చిక్కుముడి అని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హైదారాబాద్ సమస్యగా మారిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితికి త్వరలో పరిష్కారం లభిస్తుందన్నారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర నాయకుల్లోనూ పునరాలోచన ప్రారంభమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ క్షీరసాగర మథనం చేస్తోందని, ఇది ఆలస్యమైనప్పటికీ.. చివరకు అమృతం లభిస్తుందన్నారు.

ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర అంశంపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవమేనన్నారు. క్షేత్రస్థాయి పునాదుల్లోకి తెలంగాణవాదం చొచ్చుకుపోయిందన్నారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఎక్కువ మంది, తెలంగాణ పార్లమెంటు సభ్యులు తక్కువ మంది ఉన్నారని, ఇది కూడా సమస్యకు ఓ ప్రధాన కారణంగా మారిందన్నారు.

వెబ్దునియా పై చదవండి