దేశంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కలకలం రేపుతోంది. తాజాగా ఏపీ, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కరోనా కలకలం రేపుతోంది. దేవస్థానంలో పనిచేసే 16 మంది ఉద్యోగులకు కోవిడ్ సోకింది. వివిధ శాఖలలో పని చేస్తు్న్న సిబ్బందికి కరోనా సోకింది. కోవిడ్ నిబంధనల మేరకు ఆలయాల్లో చర్యలు తీసుకున్న వైరస్ మహమ్మారి ఆగడం లేదు. దాంతో భక్తులు లేక దేవస్తానం వెలవెలబోతున్నాయి.
శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి రాహుకేతు పూజలు చేసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టు పక్కల ఉన్న కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు వస్తుంటారు. ఆలయంలో గత రెండు రోజుల నుంచి భక్తులు రాక తగ్గిందంటున్నారు ఆలయ అధికారులు.
మరోవైపు ప్రతి ఏడాది రాములోరి కళ్యాణాన్ని భద్రాచలం రామాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. రాములోరి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలం వస్తుంటారు. అయితే, గతేడాది కరోనా లాక్ డౌన్ కారణంగా భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం నిరాడంబరంగా నిర్వహించారు.
భక్తులు లేకుండానే కళ్యాణం జరిగింది. ఇక ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో మరోసారి ఆలయాలు మూతపడ్డాయి. ఈరోజు జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిరాడంబరంగా భక్తులు లేకుండానే కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉదయం 10:30 గంటలకు రాములోరి కళ్యాణ మహోత్సవం ప్రారంభం కానున్నది. మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది.