అమరావతి: స్వై న్‌ఫ్లూపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీజన్‌కి అనుగుణంగా స్వైన్‌ఫ్లూ కేసులు పెరుగుతుండడంతో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ నియంత్రణ మందులను, మాస్కులను, ప్రత్యేక పడకలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేఠ అన్ని జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పాల్గొన్నారు. మూడు రోజులకు మించి జలుగు, దగ్గు, జ్వరం లక్షణాలున్న వారు అప్రమత్తమవ్వాలని ఆమె సూచించారు.
పొరుగు రాష్ట్రాల నుంచి రాకపోకలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో స్వైన్‌ఫ్లూ నిర్ధరణ కేంద్రాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రఆల నుంచి ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే చిత్తూరు, విశాఖ, విజయవాడ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఈ మూడు జిల్లాల్లోని ఎయిర్‌పోర్టుల్లో స్వైన్‌ఫ్లూ నిర్ధరణ కేంద్రాలు ప్రారంభించామని చెప్పారు.
అక్టోబరులో రాష్ట్రంలో 27 స్వైన్ ఫ్లూ కేసులు నిర్థారణ అయ్యాయని చెప్పారు. చిత్తూరులో అక్టోబరులో 9, సెప్టెంబర్‌లో 8, వైజాగ్‌లో అక్టోబరులో 8 కేసులు, అనంతపురం, కడప, కృష్ణా , ఇంకా ఇతర జిల్లాల్లో ఒక్కోటి నమోదైనట్టు చెప్పారు. అక్టోబర్‌లో 27 కేసులు నమోదు కాగా, జనవరి నుంచి అక్టోబరు వరకు 39 కేసులు నమోదయ్యాయని ఆమె పేర్కొన్నారు. స్వైన్‌ఫ్లూ వచ్చిన వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని, ఆరోగ్యవంతులెవరూ వారి దగ్గరికి వెళ్లకూడదని సూచించారు.
తప్పనిసరిగా వెళ్లాల్సివస్తే అనేక జాగ్రత్తలు తీసుకోవాలని, ముందు జాగ్రత్తచర్యగా టామీఫ్లూ ట్యాబ్లెట్ వేసుకోవడం మంచిదని ఆమె తెలిపారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న జికా వైరస్ దేశంలోకి ప్రవేశించిందని, రాజస్థాన్‌లో 23 జికా కేసులు నమోదయ్యాయని తెలిపారు. దీనిపై కేంద్రం సీరియస్‌గా ఉందని, అన్ని రాష్ట్రాలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలని హెచ్చరించినట్టు చెప్పారు.